మంత్రి జయరాం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈఎస్ఐ స్కాం నిందితుడు నుంచి మంత్రి కుమారుడు బెంజ్ కారు తీసుకున్నట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం నేతలు ఇందుకు సంబంధించి ఫోటోలు బయటపెట్టడం, ఏసీబీకి ఫిర్యాదు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది.

మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, నారా లోకేశ్‌లు జయరాంపై విమర్శలు సంధించారు. దీంతో వారి ఆరోపణలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కారు ఇచ్చారన్న ఆరోపణలను తిరస్కరించిన మంత్రి అభిమానుల కారుతో తన కుమారుడు ఫోటో మాత్రమే దిగాడని తెలిపారు.

ఆ బెంజ్ కారు ఎవరి పేరున, ఎక్కడ వుందో విచారణ చేసుకోవచ్చని.. ఒకవేళ కారు తనదేనని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు జయరాం. 

అంతకుముందు ఈఎస్ఐ స్కాంలో ఏ14 నిందితుడిగా ఉన్న కార్తీక్ మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడని అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని నిరూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

మంత్రి జయరాం కొడుకు ఈశ్వర్ కు ఈఎస్ఐ స్కాంలో ఏ 14 నిందితుడు కార్తీక్ కారును ఇచ్చాడని  అయ్యన్నపాత్రుడు ఏసీబీ టోప్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశంలోనే ఆయన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు.

ఈ విషయమై ఆధారాలను కూడ తాను పంపుతానని అయ్యన్నపాత్రుడు టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇచ్చాడు.  2019 డిసెంబర్ మాసంలో బెంజ్ కారును మంత్రి కొడుకుకు ఈ కారు గిఫ్ట్ గా అందించారని ఆయన ఆరోపించాడు.