‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’? అన్న సామెతను మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిజం చేస్తున్నారు. స్వయంగా వ్యవసాయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన మంత్రి వరి పంటను, వరి రైతులను కించపరిచే విధంగా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. కృష్ణాజిల్లాలోని నందిగామలో మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘వరిపంట సోమరిపోతు పంట’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి ఏం అన్నారంటే, ‘ పశ్చిమ కృష్ణా ప్రాంతంలో రైతులు 45 వేల ఎకరాల్లో సుబాబుల్ పంట వేశారు..వరి ఎలాగైతే సోమరిపోతు పంటో సుబాబుల్ కూడా అలాంటిదే’ అని అనటం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.

రైతులకు గతిలేకో, మరో పంట పండకో నీటి ఎద్దడి వల్ల సుబాబుల్ పంటకు అలవాటు పడ్డారని కాబట్టి రైతులు సుబాబుల్ సాగునుండి బయగపడి వాణిజ్యపంటలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మంత్రి చెప్పింది బాగానే ఉంది కానీ రైతులందరూ వరి సాగును వదిలేస్తే మనుషులు ఏం తినాలి. ఉత్తరభారత దేశంలో అంటే మొదటి నుండి గోధుమలు తినటం అలవాటు. కాబట్టి అక్కడి వారికి వరి ప్రధాన పంట కాదు.

కానీ ధక్షిణ బారత దేశంలో అలా కాదు. మొత్తం ధక్షిణ భారతంలో వరి అన్నానికే అత్యంత ప్రధాన్యత ఇస్తారు. వెరైటీ కోసం ఎప్పుడైనా చపాతీలో మరొకటో తిన్నా చాలామందికి చివరలో కనీసం పెరుగున్నం తినందే తృప్తి ఉండదు. రైతులకు ప్రధాన పంట వరి అన్న విషయం మంత్రికి తెలీదా? లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న వరిని మంత్రి సోమరిపోతు పంట అని ఏ పద్దతిలో లెక్క గట్టారో అర్ధం కావటం లేదు. పైగా వ్యవసాయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన మంత్రి ఈ విధంగా  మాట్లాడటం ఆశ్చర్య పడుతున్నారు.

మంత్రి వరస చూస్తుంటే భవిష్యత్తులో రాష్ట్రంలో అసలు వరి పంట అన్నదే లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్లే కనబడుతోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణం పేరుతో వేలాది రైతుల నుండి 37 వేల ఎకరాలు సేకరించి జీవనోపాధి పైన దెబ్బకొట్టారు. తాజాగా మంత్రి మాటలు విన్న తర్వాత రాష్ట్రంలో ఎక్కడా వరిపంట అన్నదే కనబడకుండా చేస్తారేమో?