తాము వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి రాలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారని.. ఇప్పుడు చేస్తున్నారని బొత్స ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు సత్యనారాయణ అన్నారు.

Also Read:జగన్ తో ఫైట్: ఏపీలో చంద్రబాబు టీడీపీని నిలబెట్టగలరా?

అమరావతిని రాజధానిగా ప్రకటిచినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందారని బొత్స గుర్తుచేశారు. కొందరు నీచమైన బుద్ధితో మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. అబద్ధాలకు పేటెంట్ బాబుకే ఉందని బొత్స ఆరోపించారు.

శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందో చంద్రబాబు తెలుసుకోవాలని.. రాజధాని విషయంలో మంత్రి నారాయణ కమిటీ ఆనాడు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని సత్యనారాయణ మండిపడ్డారు. బాబు హయాంలో అక్రమాలతో పాటు నిధుల దుర్వినియోగం జరిగిందని బొత్స ఆరోపించారు.

Also Read:ఏపీలో రెండు ఎమ్మెల్సీలకు పేర్లు: రవీంద్రబాబు, జకియా ఖానుంలకు ఛాన్స్?

మా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. శాసనమండలి ఛైర్మన్ ఆమోదం లేకుండా ఏదీ టేబుల్ మీదకు రాదని.. కౌన్సిల్‌లో టీడీపీ సభ్యులు వీధి రౌడీల్లా వ్యవహరించారని బొత్స దుయ్యబట్టారు.

మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఉందో లేదో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము రాజ్యాంగబద్ధంగా, న్యాయబ్ధంగా, చట్టానికి లోబడే ఏదైనా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒక పార్టీ ఆదేశాల ప్రకారమే.. అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని బొత్స ఆరోపించారు. అమరావతి రైతులను ఆదుకుంటామని సత్యనారాయణ తెలిపారు.