విపక్షాలపై మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. సీఎం జగన్‌కు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. గతంలో ఈ తరహా వ్యక్తిత్వం ఏ సీఎంకూ లేదని మంత్రి ప్రశంసించారు.  

సీఎం జగన్‌కు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో ప్రధాని సభ విజయవంతమైందన్నారు. ఏపీ ప్రభుత్వ విధానాన్ని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని.. రాష్ట్ర ఆకాంక్షలను ప్రధానికి జగన్ వివరించారని బొత్స పేర్కొన్నారు. పార్టీలు కాదు అభివృద్ధే ముఖ్యమని చెప్పారని .. గతంలో ఈ తరహా వ్యక్తిత్వం ఏ సీఎంకూ లేదని మంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలకు స్వప్రయాజనాలే ముఖ్యమని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. 

అంతకుముందు ఏయూ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దేశ ప్రగతికి ప్రధాని మోదీ రథ సారథి అన్నారు. విశాఖపట్నంలో జనసముద్రం కనిపిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ది దిశగా ముందుకెళ్తోందన్నారు. వికేంద్రీకరణ, పారదర్శకతతో పాలన సాగిస్తున్నామని... ఏపీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. రూ. 10,742 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ధన్యావాదాలు తెలిపారు జగన్. 

ALso Read:మాకు రాష్ట్ర ప్రయోజనాల తప్ప మరొక అజెండా లేదు.. కేంద్రం మరింతగా సహకరించాలి: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడం అంటే.. ప్రతి ఇళ్లు కూడా నిలదొక్కుకోవడం అని నమ్మి అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం చెప్పారు. ఇందుకోసం మరింతగా సహకారం అందించాలని ప్రధాని మోదీని కోరారు. విభజన గాయాల నుంచి ఏపీ పూర్తిగా కోలుకోలేదని అన్నారు. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేసే ప్రతి పనిని ఇక్కడ ప్రజలు గుర్తుంచుకుంటారని జగన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం అని ఆయన తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాల తప్ప మరొక అజెండా ఉండదని చెప్పారు. 

విభజన హామీల నుంచి ప్రత్యేక హోదా, పోలవరం వరకు, స్టీల్ ప్లాంట్ నుంచి పోలవరం వరకు... పలు సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పెద్దమనుసుతో వాటిని పరిష్కారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా చెప్పారు. మంచి చేసే తమ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు, పెద్దలైన మోదీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాని చెప్పారు.