టీడీపీకి ఈ నాలుగు నెలలే ఆఖరి రోజులు : బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ మనుగడకు ఈ నాలుగు నెలలే ఆఖరి రోజులు అవుతాయని బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు . నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాను కలిసినా, బాద్‌షాను కలిసినా మాకేమీ అభ్యంతరం లేదన్నారు.

విశాఖ పరిపాలనా రాజధానిపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వ్యవహారం సాంకేతిక కారణాలతోనే ఆలస్యమైందన్నారు. టీడీపీ మనుగడకు ఈ నాలుగు నెలలే ఆఖరి రోజులు అవుతాయని బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్రలో పుట్టి వుంటే రాజధాని అవసరం ఏంటో ఆయన తెలిసేదన్నారు. స్థానికులు ఆయనకు చెప్పాలని బొత్స చురకలంటించారు. విశాఖకు రాజధాని వస్తే దోపిడి కుదరదని అనుకుంటున్నారా అని సత్యనారాయణ ప్రశ్నించారు.
అటు నారా లోకేష్ అమిత్ షా భేటీపైనా బొత్స తనదైన శైలిలో స్పందించారు. నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాను కలిసినా, బాద్‌షాను కలిసినా మాకేమీ అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు తప్పు చేశారని కోర్టు భావించినందునే జైలుకు పంపించిందని.. కక్షపూరిత చర్య అంటూ లోకేష్ చేసిన ఆరోపణలపై కేంద్రం విచారణ చేస్తుందన్నారు. చంద్రబాబుకు జైల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని న్యాయస్థానం ఆదేశిస్తూ అమలు చేస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
త్వరలో విశాఖ నుంచి సమీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఈ నెల 26 నుంచి ఉత్తరాంధ్రలో తొలి దశ బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు బొత్స స్పష్టం చేశారు. 13 రోజు పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనుందని బొత్స పేర్కొన్నారు. జగన్ మళ్లీ ఎందుకు గెలవాలో ప్రజలకు వివరిస్తామని సత్యనారాయణ చెప్పారు.