Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షాను కలిసినా .. అమితాబ్‌ను కలిసినా జగన్‌ను ఓడించలేరు : చంద్రబాబు పవన్‌లపై బొత్స సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన తొలి జాబితాపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. వైసీపీ లిస్టులో ఎలాంటి గందరగోళం లేదని, జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్ సామర్ధ్యం ఏంటో అర్ధం చేసుకోవచ్చునని బొత్స చురకలంటించారు.

minister botsa satyanarayana satires on tdp chief chandrababu naidu and janasena president pawan kalyan ksp
Author
First Published Feb 25, 2024, 8:19 PM IST | Last Updated Feb 25, 2024, 8:20 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్లు అమిత్ షాను కలిసినా, అమితాబ్‌ బచ్చన్‌ను కలిసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. వైసీపీ లిస్టులో ఎలాంటి గందరగోళం లేదని, జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్ సామర్ధ్యం ఏంటో అర్ధం చేసుకోవచ్చునని బొత్స చురకలంటించారు. వారికి విధి విధానాలు ఏమీ లేవని , మళ్లీ దోచుకుతినడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 

టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు అంశం తమ పార్టీకి అనవసరమని.. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయ్యాలని బొత్స సత్యనారాయణ కోరారు. చంద్రబాబు, పవన్‌లు ఏం చేశారని ఓట్లు అడుగుతారని బొత్స ప్రశ్నించారు. గతంలో వారు చేసిన మోసాలను చూసి ఓట్లు వేయాలా అంటూ దుయ్యబట్టారు. జనసేన అవసరమా , కాదా అన్న అంశాన్ని ప్రజలే తేలుస్తారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

ఇకపోతే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తూ వస్తున్న ఆయన.. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తూ వచ్చారు. ప్రజా వ్యతిరేకత వుంటే ఆత్మీయులు, సన్నిహితులకైనా టికెట్లు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు గాను జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. 

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మీటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అన్ని స్థాయిలకు చెందిన దాదాపు 2 వేల మంది నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. వై నాట్ 175 లక్ష్యంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని జగన్మోహన్ రెడ్డి నేతలకు సూచించనున్నారు. ప్రత్యర్ధుల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో, ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలనే దానిపై నేతలకు ముఖ్యమంత్రి వివరించనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios