Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అప్పులు సరే .. విభజన హామీలు, ప్రత్యేకహోదా సంగతేంటీ .. వాటిపైన మాట్లాడరా : పురందేశ్వరికి బొత్స కౌంటర్

ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందంటూ పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.  ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పురందేశ్వరి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని బొత్స మండిపడ్డారు.

minister botsa satyanarayana fires on ap bjp chief daggubati purandeswari ksp
Author
First Published Jul 29, 2023, 4:38 PM IST

ఏపీ బీజేపీ చీఫ్‌గా పగ్గాలు అందుకున్న తర్వాత దగ్గుబాటి పురందేశ్వరి తన దూకుడు పెంచారు. కార్యకర్తలకు అందుబాటులో వుండటంతో పాటు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి వాడి వేడి విమర్శలు చేస్తున్నారు. దీనికి అధికార పక్షం నుంచి అలాగే కౌంటర్ వస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందంటూ పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలన చూసి ఓర్వేలేకే ఇలా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమం పురందేశ్వరికి కనిపించడం లేదా అని బొత్స ప్రశ్నించారు. వాటిని పక్కనబెట్టి కేవలం ప్రభుత్వం చేస్తున్న అప్పులను మాత్రమే ప్రస్తావించడం సరికాదని సత్యనారాయణ దుయ్యబట్టారు. దేశంలోని రాష్ట్రాలు చేస్తున్న అప్పుల్లో ఏడో స్థానంలో ఏపీ వుందని కేంద్రం చెప్పినప్పుడు.. మిగిలిన ఆరు రాష్ట్రాల గురించి, బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పురందేశ్వరి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని బొత్స మండిపడ్డారు.

Also Read: చంద్రబాబు మాటలే .. ఆమె నోటి వెంట, టీడీపీకి అధ్యక్షురాలా, ఏపీ బీజేపీకి ప్రెసిడెంటా : పురందేశ్వరిపై రోజా ఫైర్

అంతకుముందు మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలా..? లేక టీడీపీ అధ్యక్షురాలా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు , టీడీపీ నేతలు ఏం మాట్లాడితే పురందేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారని రోజా ఆరోపించారు. ఏపీ అప్పుల్లో వుందని పురందేశ్వరి చెబుతున్నారని.. కానీ అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువేనని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని రోజా గుర్తుచేశారు. మరి నిర్మల చెప్పింది తప్పా..? పురందేశ్వరి చెబుతున్నది తప్పా అని ఆమె డిమాండ్ చేశారు. 

తెలుగుదేశం పార్టీ హయాంలోనే తలకుమించిన అప్పులు చేశారని రోజా ఫైర్ అయ్యారు. ఏదో ఒక మ్యాప్ తీసుకుని చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. మరి 14 ఏళ్లు సీఎంగా వుండి గాడిదలు కాశారా అని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో వున్నప్పుడు సంక్షేమం , అభివృద్ధి అనేది ఆయనకు గుర్తుకురాదని.. విపక్షంలో వున్నప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడుతారని ఆమె దుయ్యబట్టారు. అలాగే నదుల అనుసంధానం కన్నా నిధుల అనుసంధానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని మంత్రి రోజా ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios