విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉన్న విషయం వాస్తవమేనని.. అయితే లాభాల్లో లేని ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని బొత్స సూచించారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర పారిశ్రామిక విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు తిరిగి పుంజుకోవడానికి కావాల్సిన చర్యలను కేంద్రం తీసుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా వున్నామని ఆయన తేల్చి చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మంచి ఫలితాలు వచ్చాయని.. రెండో దశలో ఏకగ్రీవాలతో కలిపి 2,639 స్థానాలు వచ్చాయని బొత్స సత్యనారాయణ తెలిపారు.