ఇటీవల వైసీపీలో చోటు చేసుకున్న ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇచ్చిన మాట నిలపెట్టుకొకపోవటం వల్లే చంద్రబాబు ఓడిపోయారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
ఇటీవల వైసీపీలో చోటు చేసుకున్న ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. గురవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు గత ఏడాది సీట్లు ఇచ్చిన అందరు గెలిచారా అని ప్రశ్నించారు. ప్రతీ పార్టీలో జరిగే ప్రక్రియ మా పార్టీలో జరిగిందని బొత్స పేర్కొన్నారు. గెలుపు కోసమే మార్పు అని.. ఇప్పటివరకు వైసీపీ ప్రజలకు అండగా ఉంది అని మంత్రి అన్నారు. ఇచ్చిన మాట నిలపెట్టుకొకపోవటం వల్లే చంద్రబాబు ఓడిపోయారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
విడతలవారీగా మధ్యపాన నిషేధం చేస్తామని చెప్పామని, అదే విధంగా చేస్తున్నామని.. సామాన్యులకు మందు దొరకకుండానే చేస్తున్నామని బొత్స పేర్కొన్నారు. ప్రజల్లో పరివర్తన తెస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని మంత్రి జోస్యం చెప్పారు. కుప్పం సిట్ విషయంలోనే బాబుకు గ్యారెంటీ లేదని.. ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేస్తున్నారని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.
Also Read: కరువు , తుఫాన్.. ఏపీలో దేనికేం చేయాలో తెలియని సీఎం, మన దౌర్భాగ్యం : చంద్రబాబు హాట్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ వచ్చాక అంగన్వాడీలకు పెంచిన జీతం ఎప్పుడు పెంచలేదని బొత్స పేర్కొన్నారు. అంగన్వాడీలు ఆందోళన విరమించాలి...ప్రభుత్వంతో చర్చించాలని ఆయన కోరారు. చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, పంట నష్టంపై వర్షం తగ్గాక అంచనా వేస్తారని బొత్స చురకలంటించారు. కానీ ఈలోపే మాట్లాడటం సరైంది కాదన్నారు. రంగు మారిన ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారని సత్యనారాయణ తెలిపారు. రైతులు నష్టపోకుండా ఏర్పాట్లు చెయ్యాలని సీఎం సూచించారని మంత్రి వెల్లడించారు.
ఇకపోతే.. ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫానును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపాను లాంటివి వచ్చినప్పుడు దానిని ఆపలేకపోయినా , కలిగే నష్టాన్ని నియంత్రించగలమన్నారు. పోలవరం పూర్తయితే గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వస్తాయని, అక్కడ ఎప్పుడూ నీళ్లు త్వరగా వస్తాయని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లోని 22 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని.. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు భరోసా కల్పించాలని, పంట నష్టం ఎంతో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. జాతీయ విపత్తులు వచ్చినప్పుడు కేంద్రాన్ని అప్రమత్తం చేయాలని, చివరికి తాను లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. కరువులు, తుపానులు వస్తే ఏం చేయాలో ముఖ్యమంత్రి జగన్‌కు తెలియదన్నారు.
తుపాను బాధితులను కార్పెట్ వేసుకుని పరామర్శిస్తున్నారని , ఆయనేమైనా కార్పెట్‌లో పుట్టాడా అంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. చివరికి ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం వుండటం మన దౌర్భాగ్యమన్నారు. ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, 24 శాతం నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా వుందన్నారు.
