Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేటీకరణ ఆగే వరకు ఉద్యమమే.. మోడీని నిలదీయండి: చంద్రబాబుకు అవంతి చురకలు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందని తెలిపారు

minister avanthi srinivas slams tdp chief chandrababu naidu over vizag steel plant ksp
Author
Visakhapatnam, First Published Mar 9, 2021, 9:42 PM IST

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందని తెలిపారు.

తమకు తెలిసి జరుగుతోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అవంతి స్పష్టం చేశారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తే అన్ని పక్షాలను తీసుకెళ్లి సమస్య వివరిస్తామని ఆయన తెలిపారు. తాము కేంద్రంతో రాజీ పడితే పార్లమెంట్‌లో ఎందుకు ప్రశ్నిస్తామని మంత్రి అవంతి ఎద్దేవా చేశారు.

పార్లమెంట్‌లో బలం ఉంటే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారా అని శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ, కేంద్రాన్ని విమర్శించకుండా తమపై విమర్శలు చేస్తారా అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు ఉద్యమానికి మద్దతుగా ఉంటామని అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. సబ్బంహరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని కాకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారంటూ అవంతి ధ్వజమెత్తారు.

చంద్రబాబు పార్టీలో సబ్బంహరి ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ కోసం పవన్‌ కళ్యాణ్ ఏం చేస్తారో చెప్పాలని అవంతి నిలదీశారు. పార్లమెంట్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై ప్రశ్నించానని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు.

కేంద్ర వైఖరిని తెలుసుకునేందుకు ప్రశ్నించినట్టు ఆయన స్పష్టం చేశారు. టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారని, వాళ్లెవరైనా ప్రశ్నించారా అని సత్యనారాయణ నిలదీశారు. టీడీపీ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడిందని,  బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ ప్రైవేటీకరణపై ప్రశ్నించాలని ఎంపీ డిమాండ్ చేశారు.

స్టీల్ ప్లాంట్‌కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడుతున్నాడని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. త్యాగాల పునాదులపై విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మించారని, ప్రధాని మోడీ పేరు ఎత్తితే చంద్రబాబుకు వణుకు పుడుతోందంటూ కన్నబాబు ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios