విశాఖపట్టణం:  శిరోముండనానికి గురైన శ్రీకాంత్ ను ఏపీ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆదీప్ రాజు లు ఆదివారం నాడు పరామర్శించారు.భవిష్యత్తులో  నూతన్ నాయుడు నుండి తనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని బాధితుడు మంత్రిని కోరారు. 

ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టుగా మంత్రి హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు, ఇళ్ల స్థలం ఇవ్వనున్నట్టుగా ఆయన హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే ఆదీప్ రాజ్  బాధితుడికి రూ. 50 వేలు ఆర్ధిక సహాయం చేశారు.

ఈ తరహా ఘటనలపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని మంత్రి చెప్పారు. ఈ తరహా ఘటనలను ముఖ్యమంత్రి ఉపేక్షించరని ఆయన గుర్తు చేశారు. 

విశాఖపట్టణంలో నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసి మానేసిన శ్రీకాంత్ ను శిరోముండనం చేశారు. ఈ విషయమై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో దళితులపై దాడులు, శిరోముండనం ఘటనలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.

రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకొన్న ఘటనలపై విపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.