బోటు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్షాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. బోటు  ప్రమాదంపై ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారని ఇలాంటి విషాద ఘటనపై రాజకీయాలు వద్దని అవంతి హితవుపలికారు.

తనకు బోటు ఉన్నట్లు  నిరూపిస్తే రాసిచ్చేస్తానని శ్రీనివాస్ సవాల్ విసిరారు. బోటు వెలికితీతపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. బాధితులకు న్యాయం చేస్తామని అవంతి స్పష్టం చేశారు.

గోదావరిలో పాపికొండల విహార యాత్రపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. కాగా దేవిపట్నం వద్ద ప్రమాదం జరిగిన బోటును ఎస్ఐ అడ్డుకున్నారని.. అయితే పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఒత్తిడి వల్లే బోటు ముందుకు కదిలిందంటూ మాజీ  ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.

బోటును బయటకు తీస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తాయని అందుకే బోటును బయటకు తీయడం లేదంటూ హర్షకుమార్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను మంత్రి అవంతి ఖండించిన సంగతి తెలిసిందే. 

కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.