రాజీనామాకు సిద్ధం...

Minister atchennaidu challenges on kapu reservation bill
Highlights

  • ‘ప్రభుత్వం ఆమోదించిన కాపుల రిజర్వేషన్ వల్ల బిసిలు నష్టపోతారని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తా’నంటూ బిసి సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు సవాలు విసిరారు.

‘ప్రభుత్వం ఆమోదించిన కాపుల రిజర్వేషన్ వల్ల బిసిలు నష్టపోతారని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తా’నంటూ బిసి సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు సవాలు విసిరారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న బిల్లును అచ్చెన్నే శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సరే, ఎలాగూ ప్రతిపక్షం సభలో లేదు కాబట్టి సభ కూడా బిల్లును ఏకపక్షంగానే ఆమోదించేసింది. తర్వాత చంద్రబాబును మరో అంబేద్కర్ అని, కాపుల బాంధవుడని ఒకటే పొగడ్తలు సభలో.

సరే, విషయానికి వస్తే కాపులకు రిజర్వేషన్ వర్తింపచేయటం వల్ల బిసిలకు ఎటువంటి నష్టమూ జరగదన్నది అచ్చెన్న వాదన. ఎందుకు జరుగుతుంది? అసలు కాపుల రిజర్వేషన్ అమల్లోకి వస్తేనే కదా? ఎవరికైనా నష్టమైనా ? లాభమైనా ? కాపులను బిసిల్లోకి చేర్చాలన్న ఎన్నికల హామీని చంద్రబాబు దిగ్విజయంగా కేంద్రంపైకి నెట్టేసారనటంలో సందేహమే లేదు.  

మంత్రివర్గం ఆమోదించిన, అసెంబ్లీ తీర్మానం చేసిన కాపులకు రిజర్వేషన్ అంశం అమల్లోకి రావటమన్నది మామూలు విషయం కాదు. కేంద్రం ఒప్పుకోవాలి. పార్లమెంటులో చర్చ జరగాలి. తర్వాత అవసరమైతే ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో బిల్లు పాసైతే అప్పుటు రాష్ట్రపతి సంతకానికి వెళుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్ధాన్ ప్రభుత్వాలు పంపిన తీర్మానాలు పెండింగ్లో ఉన్నాయి కేంద్రంలో. ఏపి పంపిన తీర్మానం నాలుగోది. కేంద్రం వద్ద ఎప్పటికి ఈ తీర్మానాలన్నీ ఆమోదం పొందాలి?

చంద్రబాబుకు కావాల్సినదేంటి? తన హామీని తాను నెరవేర్చుకున్నాను అని వందిమాగదులతో భజన చేయించుకుని పచ్చ పత్రికల్లో రాయించుకోవటమే. అది ఎలాగూ మొదలైపోయింది. కాపుల్లో చంద్రబాబు వాదనను సమర్ధించేవాళ్ళూ ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళూ ఉంటారు. కాబట్టి కాపులకు బిసి రిజర్వేషన్ అన్న అంశం వచ్చే ఎన్నికల్లో ఎటుతిరిగీ కీలకమవుతుంది.

అందుకే అచ్చెన్న మాట్లాడుతూ బిసిలకు నష్టం జరుగుతుందని నిరూపించండి అంటూ అంత ధైర్యంగా సవాలు విసిరారు. ఎందుకంటే, కేంద్రం వద్ద ఈ బిల్లు పాసయ్యేది లేదన్న విషయం అందరికీ తెలుసు. నిజంగా కాపులపై చంద్రబాబుకు అంత ప్రేమే ఉంటే కొత్తగా 5 శాతం రిజర్వేషన్ ఎందుకు? బిసిలకు ఇపుడున్న రిజర్వేషన్ శాతంలోనే కలిపేస్తే బిల్లును అసలు కేంద్రానికి పంపాల్సిన అవసరమే లేదుకదా? పోలవరమైనా, కాపుల రిజర్వేషన్ అంశమైనా జాగ్రత్తగా గమనిస్తే  చంద్రబాబు భాజపాను ఇరికించే పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారన్న విషయం అర్ధమైపోతుంది. మరి చూడాలి కేంద్రప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ?

loader