అమరావతి: తప్పు చేసిన టిడిపి నాయకులు అరెస్టయితే బీసీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తప్పులు చేస్తే కులం, మతం అంటకట్ట వచ్చా? అని ప్రశ్నించారు. నేరాలు చేసిన వారిని అరెస్టు చేయకుండా మరిన్ని నేరాలు చేసేలా బయట తిరగనివ్వాలా? అని అన్నారు. 

''మాజీ మంత్రి కొల్లు రవీంద్రను స్పష్టమైన ఆధారాలతో అరెస్టు చేశారు. హత్య చేయించిన వ్యక్తి మాత్రమే కాదు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కూడా బిసినే. కుటుంబానికి పెద్దదిక్కయిన భాస్కర్ రావు చనిపోతే ఆయన కుటుంబం రోడ్డు మీద పడలేదా. నిజంగానే కోల్లు రవీంద్ర తప్పు చేయకపోతే పోలీసుల్ని చూసి గోడ దూకి ఎందుకు పారిపోయాడు '' అంటూ అనిల్ అడిగారు. 

''ఇక మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాటలు చూస్తుంటే కౌరవుల సభ గుర్తుకు వస్తోంది. ఓ మహిళపై అసభ్యకర చేసిన అయన్నను, ఆయన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్ధిస్తాడా? అలాగే రూ.150కోట్లు దోచిన మరో మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు చేస్తే కూడా బీసీ కులం వాడతారా? తప్పు చేసి అడ్డంగా దొరికితే కులాన్ని అంటకట్టడం టడీపీ మామూలు అయిపోయింది'' అని మండిపడ్డారు. 

read more  కరోనా కాదు... ఇళ్లస్థలాల పంపిణీ వాయిదా అందుకోసమే: బుద్దా వెంకన్న

''బీసీలపై ప్రేముంటే ఐదు ఏళ్ల మీరు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. 50వేల కోట్లు ఖర్చు పెడతామని కనీసం 15వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంది చంద్రబాబే. బీసీల అభివృద్ది కోసం జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే  20వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నామినేట్ పదవిలో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. మేము, మా నాయకుడు ఎప్పుడు ఇలాంటి చౌకభార రాజకీయాలు చేయం'' అని అన్నారు. 

''మీ ప్రభుత్వంలో నాపై అక్రమంగా  కేసులు పెట్టారు. అయినా ఒక్కటి కూడా నిరూపించలేక పోయారు. నేను బీసీ ఎమ్మెల్యేను కాదా? మీరా బీసీల ఆత్మాభిమానం గురించి మాట్లాడేది. చట్టం ముందు కులాలు,  మతాలు ఒక్కటే'' అని మంత్రి పేర్కొన్నారు. 

''30లక్షల మందికి ఇళ్లు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. ఆ 30లక్షల లబ్దిదారుల్లో 22లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ లబ్దిదారులు వున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా పేదప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం'' అని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.