Asianet News Telugu

కరోనా కాదు... ఇళ్లస్థలాల పంపిణీ వాయిదా అందుకోసమే: బుద్దా వెంకన్న

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ ఇళ్ల స్థలాల అమ్మకం కార్యక్రమం మరోసారి వాయిదాపడిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న స్పందించారు. 

budda venkanna comments on flats distribution programme postpone
Author
Vijayawada, First Published Jul 6, 2020, 6:57 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ ఇళ్ల స్థలాల అమ్మకం కార్యక్రమం మరోసారి వాయిదాపడిన విషయం తెలిసిందే. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో పేదల నుంచి దోచుకుంటున్న సొమ్ములో వాటాలుపంచుకునే క్రమంలో అధికారపార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు విబేధాలు తలెత్తినందువల్లే ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. 

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇళ్లపట్టాల పంపిణీని ఇప్పటికి మూడుసార్లు వాయిదా వేసిందని, ఇళ్లస్థలాల కొనుగోళ్లలో జరిగే వ్యవహరాల్లో అధికారపార్టీ వారికి డీల్స్ సరిగా కుదరకపోవడమే అందుకు ప్రధానకారణమని బుద్దా తెలిపారు. ఏ2 విజయసాయిరెడ్డికి పుట్టినరోజు కానుకగా 108వాహనాల రూపంలో రూ.307కోట్లు దోచిపెట్టిన జగన్, విజయసాయి ఆలోచనమేరకే ఇళ్లస్థలాల పంపిణీ పేరుతో తక్కువ ఖరీదు చేసే పొలాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి భారీ దోపిడీ చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. 

'' ప్రభుత్వం సాగిస్తున్న కుంభకోణంపై టీడీపీ మాట్లాడటం లేదని... అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దీనిపై పలుమార్లు మాట్లాడటం జరిగిందన్నారు. చంద్రబాబు కుటుంబం ఎన్నోఏళ్ల నుంచి సాగిస్తున్న హెరిటేజ్ వ్యాపారాన్ని తప్పుపడుతూ పాలు-పెరుగుపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్ల దోపిడీ జరిగిన ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమంపై కూడా తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి'' అని బుద్దా డిమాండ్ చేశారు. 

''పేదలకు నిజంగా ఇళ్లస్థలాలు ఇస్తున్నామని వైసీపీ ప్రభుత్వం భావించినట్లయితే ప్రభుత్వ, దళితుల, అసైన్డ్ భూములను లాక్కోవడం, ఎందుకూ పనికిరాని భూములకు అధికమొత్తంలో ధర చెల్లించి కొనుగోలుచేయడం వంటి వ్యవహరాలపై జగన్ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. జగన్ కు బెంగుళూరులో వైట్ హౌస్, హైదరాబాద్ లో లోటస్ పాండ్, తాడేపల్లిలో పెద్ద రాజప్రాసాదం ఉంటే, పేదలకు మాత్రం ఊళ్లకుదూరంగా, శ్మశానాల పక్కన స్థలాలు కేటాయించడం ఏంటి'' అని టీడీపీ నేత ప్రశ్నించారు. 

read more   ఏపీ సీఎం వైెెఎస్ జగన్ కోటరీ ఇదే: ఎవరు ఏమిటంటే....

కాంగ్రెస్ హయాంలో గాలివానకు కొట్టుకుపోయే విధంగా ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చేవారని... టీడీపీ ప్రభుత్వం వచ్చాక నాణ్యతతో పదికాలాలపాటు ఉండేలా నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 90శాతం పూర్తయిన 6లక్షల ఇళ్లను కేవలం 10శాతం పూర్తిచేసి  పేదలకు ఇవ్వడానికి వైసీపీకి ఉన్న అభ్యంతరమేమిటని వెంకన్న నిలదీశారు. 

చంద్రబాబు ప్రభుత్వం 8లక్షల 50,173 ఇళ్లను పూర్తిచేసి లబ్దిదారులకు కేటాయించిందని, 6లక్షల15,630ఇళ్లు 90శాతం వరకు పూర్తయ్యాయన్నారు. 90శాతం వరకు పూర్తయిన ఇళ్లకు సబంధించి లబ్దిదారులకు చెల్లించాల్సిన రూ.1100కోట్లను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని... ఆ మొత్తాన్ని కూడా తక్షణమే లబ్దిదారులకు చెల్లించాలన్నారు. ప్రభుత్వం తనకు నచ్చిన కాంట్రాక్టర్లకేమో ముందస్తు చెల్లింపులు చేస్తోందని, పేదలకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదన్నారు. 

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బడా బడా కాంట్రాక్టర్లకే మేలుచేస్తూ, చిన్నచిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడికి పేరొస్తుందన్న ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం 6లక్షల పైచిలుకు పేదలపై కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వం ఇళ్ల పంపిణీ వ్యవహారంలో జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తోందని, అందుకే గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లన్నీ నిరుపయోగంగా మారాయన్నారు. పేదల జీవితాలతో ఆడుకుంటూ వారి ఆశలపై నీళ్లు చల్లకుండా గత ప్రభుత్వం నిర్మించిన 6లక్షల15,630ఇళ్ల నిర్మాణాన్ని పదిశాతం పూర్తిచేసి అర్హులకు కేటాయించాలని వెంకన్న డిమాండ్ చేశారు. 

వైఎస్సార్ ఇళ్లస్థలాల అమ్మకం పేరుతో  ప్రభుత్వం కొనసాగిస్తున్న కార్యక్రమంలో అధికారపార్టీకి చెందిన నేతలు రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు పేదల నుంచి  దోచుకుంటున్నారని, పేదవాడిని మరింత నాశనం చేసే చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోందని బుద్దా దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లస్థలాల్లో కూడా నాణ్యతతో కూడిన ఇళ్లను నిర్మించి, అన్నివసతులు కల్పించి సకాలంలో పేదలకు అందించాలని తమ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్టు  బుద్దా స్పష్టం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios