స్కామ్‌లు, అవినీతి చేసిన వాళ్లకి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని ఆరోపించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. సోమవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు, అగ్రవర్ణాలకు వేరు వేరుగా చట్టాలున్నాయా అని మంత్రి ప్రశ్నించారు.

Also Read:ఇబ్బంది పెట్టడమే వాళ్ల లక్ష్యం, అసెంబ్లీలో జరిగేదీ అదే.. జేసీ

అవినీతి చేశారని అరెస్ట్ చేస్తే బీసీలు ఏకం కావాలా అని అనిల్ నిలదీశారు. అవినీతికి పాల్పడిన వారిలో రెండు వికెట్లు పడ్డాయని... ఇంకా చాలా మంది ఉన్నారని చిట్టాలు బయటకు తీసే పనిలో ఉన్నామన్నారు.

ఏపీ ఫైబర్‌లో అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని కేబినెట్‌లో నిర్ణయిస్తే లోకేశ్ భయపడిపోతున్నారని అనిల్ ఎద్దేవా చేశారు. ఎవరు చేసిన పాపం వాళ్లు అనుభవించకతప్పదని.. చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని మంత్రి తెలిపారు.

Also Read:అచ్చెన్నాయుడికి బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్

అక్రమాలకు పాల్పడకుండా ఉంటే నిరూపించుకోవాలని అనిల్ కుమార్ సవాల్ విసిరారు. ప్రతిదానికి కులాలు, బీసీలంటూ ఎందుకు డ్రామాలాడుతున్నారన్న ఆయన... ధైర్యముంటే  విచారణకు సిద్ధమని తేల్చి చెప్పాలని వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి హితవు పలికారు.