ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కావాలనే ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తమకు ఎవరు ఎదురుపడినా వాళ్లను ఫినిష్ చేస్తారనన్నారని గుర్తు చేశారు.

కేసులు ఉన్నా.. లేకపోయినా ఇబ్బంది పెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో రేపు ఏమీ జరగదు.. అవసరమైతే టీడీపీ వాళ్లను బయటకు పంపేసి బిల్లు పాస్ చేసుకుంటారని తెలిపారు. 

‘‘జేసీ ప్రభాకర్‌రెడ్డి, అశ్విత్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్‌లో పేర్లు లేవు... అయినా అరెస్ట్ చేశారన్నారు. ఇప్పటివరకు తనపై ఎటువంటి కేసులు లేవు. రేపు ఒక కేసు సృష్టించి లోపల పడేస్తారు... అనుభవించాల్సిందే.. తమ కుటుంబంపై ఎంతగా ప్రేమాభిమానాలు ఉన్నాయో తెలిపేందుకే నారా లోకేష్ మా ఇంటికి వచ్చారు. వాహనాలు అమ్మిన వారిని, ఏజెంట్లను, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా..  అక్రమంగా మా కుటుంబంపై కేసులు నమోదు చేశారు. బెయిల్ పిటిషన్ వేస్తున్నాం.. తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం.’’ అని ఆయన పేర్కొన్నారు.