జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. ఇప్పటికే చెప్పులు పోయాయని.. ఏదో ఒకరోజు పవన్ బట్టలు కూడా పోతాయని మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చెప్పులు పోతే వెతుక్కుంటే దొరుకుతాయన్నారు.
కాకినాడలో జరిగిన వారాహి విజయ యాత్ర సభలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. సోమవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్పీచ్ అంతా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దాడే వ్యక్తి జగన్ అంటూ చంద్రబాబు మాట్లాడున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్న పనికిమాలిన వ్యక్తి చంద్రబాబంటూ ఆయన దుయ్యబట్టారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లాక్కున్న వ్యక్తంటూ అంబటి చురకలంటించారు. సీఎం జగన్‌ను కరకట్ట కమల్ హాసన్ అంటున్నారని.. చంద్రబాబు కరకట్ట ప్రకాశ్ రాజ్ అంటూ మంత్రి సెటైర్లు వేశారు. ప్రకాశ్ రాజ్ పోషించిన విలక్షణమైన పాత్రలను చంద్రబాబు నిజ జీవితంలో పోషిస్తున్నారని రాంబాబు ఎద్దేవా చేశారు.
కురుక్షేత్రం ప్రారంభమవుతుందని.. త్వరలోనే కౌరవ వధ జరుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని రాంబాబు మండిపడ్డారు. వైఎస్ చేతిలో రెండుసార్లు, జగన్ చేతిలో ఒకసారి కౌరవ వధ జరిగిందంటూ మంత్రి దుయ్యబట్టారు. వైసీపీ ఎవరి దగ్గరి నుంచో లాక్కొన్న పార్టీ కాదన్నారు అంబటి. జగన్ తన రెక్కల కష్టంతో , ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పార్టీని అధికారంలోకి తెచ్చారని రాంబాబు ప్రశంసించారు. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలను నిర్మించడంతో పాటు మరెన్నో దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారని రాంబాబు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్‌లో పైసా అవినీతి జరగలేదని మంత్రి స్పష్టం చేశారు.
ALso Read: పవన్ ఒక రాజకీయ వ్యభిచారి.. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలి.. : ద్వారంపూడి సవాలు..
వారాహిపై వుండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్‌కు పుట్టగతులుండవని పవన్ కల్యాణ్‌ను హెచ్చరించారు రాంబాబు. అలాంటి మాటలు అన్నందుకు గాను ఇకపై పవన్ నటించిన సినిమాలు హిట్టు కావని, ఇది వారాహి అమ్మవారి శాపమని అంబటి దుయ్యబట్టారు. చెప్పులు పోతే వెతుక్కుంటే దొరుకుతాయని పవన్‌పై సెటైర్లు వేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. ఆయనను బట్టలూడదీసి కొడతానని చెప్పడం దారుణమన్నారు. ద్వారంపూడిని కొట్టేంత మగాడా పవన్ అంటూ రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే చెప్పులు పోయాయని.. ఏదో ఒకరోజు బట్టలు కూడా పోతాయని మంత్రి సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని తేల్చేశారు. హైదరాబాద్‌లోని పవన్ ఇంటి ముందు బార్ వుందని.. అక్కడికి వచ్చిన యువకుల్లో కొందరు అటు ఇటూ తిరిగితే తనపై రెక్కీ చేశారంటూ జనసేనాని గగ్గోలు పెట్టారని రాంబాబు చురకలంటించారు. ఆయన పవన్ ఏం పీకాడని ఆయనను చంపుతారంటూ ఎద్దేవా చేశారు. 200 కోట్లు ఖర్చు పెట్టి పవన్‌ను ఓడించే కర్మ ఎవరికి పట్టిందని అంబటి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పిచ్చోడని.. అర్ధం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
