చంద్రబాబును జైల్లోనే చంపేందుకు కుట్రలా..! భువనేశ్వరివి చౌకబారు వ్యాఖ్యలు.. : అంబటి కౌంటర్
టిడిపి అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపడానికి కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చంపేందుకు వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కేవలం సానుభూతి కోసమే చంద్రబాబు అనారోగ్యం బారిన పడ్డారని ఆయన కుటుంబం నాటకాలు ఆడుతోందని అన్నారు. అవినీతి చేసి జైలుకు వెళ్లిన భర్త కోసం నారా భువనేశ్వరి ప్రభుత్వంపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నామని... చంపాలని చూస్తున్నామంటూ ఆయన కుటుంబసభ్యులు, టీడిపి నాయకులు ఆరోపిస్తున్నారని అన్నారు. కానీ చంద్రబాబును చంపాల్సిన అవసరం తమకు లేదని... చట్టం తన పని తాను చేసుకుని పోతోందని అంబటి అన్నారు.
టిడిపి అధికారంలో వుండగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు... తప్పు చేసాడు కాబట్టే ఇప్పుడు చట్టపరంగా శిక్ష అనుభవిస్తున్నాడని అంబటి అన్నారు. ఆయనపై వైసిపి నాయకులకు ఎలాంటి కక్ష లేదన్నారు. ఆయనకు హై ప్రొఫైల్డ్ వ్యక్తి కాబట్టే కోర్టు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని సూచించారు... ఆ ఆదేశాలను జైళ్ల శాఖ అధికారులు పాటించారని అన్నారు. కానీ టిడిపి నాయకులు వాస్తవాలకు భిన్నంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జైల్లో వున్న చంద్రబాబు ఐదు కిలోలు తగ్గారంటున్న ఆ పార్టీ నాయకుల ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని అంబటి అన్నారు.
రూ.370 కోట్ల ప్రజాధనం లూటీచేసిన ముద్దాయి చంద్రబాబు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బురద చల్లుతున్నారని అంబటి అన్నారు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు అనారోగ్యం... జగన్ రాజకీయ కక్ష సాధింపు... వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ టిడిపి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు ప్రాణహాని అంటూ మరో దుష్ప్రచారాన్ని ప్రారంభించారని మంత్రి అన్నారు.
Read More చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ ఆందోళన... జగన్ సర్కార్ పై సీరియస్
చంద్రబాబు తప్పు చేసాడు... అది చంద్రబాబు కుటుంబం, టిడిపి నాయకులకే కాదు ప్రజలందరికి తెలుసని అంబటి రాంబాబు అన్నారు. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని... అందుకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు ఏమీ అతీతుల కాదన్నారు. ఇలా ఇప్పటికే దేశంలో అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు అరెస్టయ్యారు... అలాంటి అరెస్టే చంద్రబాబుది కూడా అని అన్నారు. కానీ ఆయన అరెస్ట్ అక్రమమని టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఇప్పుడు వయసు, ఆరోగ్య సమస్య అని మరో నాటకమాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారని అంబటి అన్నారు.
చంద్రబాబును కాపాడేందుకు ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధీశ్వరి ప్రయత్నిస్తున్నారని అంబటి అన్నారు. అందువల్లే లోకేష్ ను వెంటపెట్టుకుని వెళ్లి కేంద్ర హోంమంత్రిని కలిపించారని అన్నారు. తప్పుచేసిన వ్యక్తిని కాపాడాలని ప్రయత్నించినా చట్టం వదిలిపెట్టదని అంబటి అన్నారు.
చంద్రబాబుకు స్కిన్ డిసిస్ ఉందని ప్రజలందరికీ తెలుసని అంబటి అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని... ఆయనకు ఎలాంటి ప్రమాదమూ లేదన్నారు. కావాలనే ఆయనకు ఏదో జరిగిపోతోందని కుటుంబసభ్యులు, టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో వున్న తమపై వుందని... అందువల్లే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.