చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ ఆందోళన... జగన్ సర్కార్ పై సీరియస్
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న చంద్రబాబు అనారోగ్యం బారిన పడటంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు.

అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు గత నెలరోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుంటున్నారు. అయితే తాజాగా రాజమండ్రిలో ఉక్కపోత వాతావరణం కారణంగా చంద్రబాబు డీహైడ్రేషన్, చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అలాగే బాగా బరువుతగ్గిన చంద్రబాబు కనీసం కూర్చోడానికి కూడా ఇబ్బందిపడుతున్నాడని... చాలా నీరసంగా కనిపించాడని భార్య భువనేశ్వరి ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కూడా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసారు.
ప్రత్యర్థి పార్టీ నాయకుడిగా చంద్రబాబుపై వైసిపి నాయకులు కక్షగట్టారని పవన్ ఆరోపించారు. కనీసం సాటి మనిషి అనారోగ్యంతో వున్నాడని కూడా చూడటంలేదని... ఏమాత్రం మానవత్వంతో వ్యవహరించడం లేదని అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని మండిపడ్డారు. రాజమండ్రి జైల్లో వున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదని అన్నారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు ప్రస్తుతం జైల్లో పరిస్థితుల వల్ల ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య భువనేశ్వరితో పాటు కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని పవన్ అన్నారు. వారి బాధను అర్థం చేసుకోకుండా ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు వైసిపి ప్రభుత్వ వైఖరిని సూచిస్తోందని అన్నారు. చంద్రబాబు అనారోగ్యానికి గురయినా ఇంకా
రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని వైసిపి నాయకులను పవన్ సూచించారు.
Read More కనీసం కూర్చోలేని స్థితిలో చంద్రబాబు వున్నారట... కటకటాల్లో భర్తను చూసి తల్లడిల్లిన భువనేశ్వరి
చంద్రబాబు కుటుంబం ఆందోళన... డాక్టర్లు నివేదికను దృష్టిలో వుంచుకుని న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని పవన్ కోరారు. చంద్రబాబుకు ఏమయినా పర్వాలేదు... తమ కక్షసాధింపే ముఖ్యం అనేలా ప్రభుత్వ వైఖరి వుందన్నారు. జైల్లో వున్న చంద్రబాబుకు ఏమయినా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
ఇదిలావుంట నిన్న(శనివారం) సాయంత్రం నారా భువనేశ్వరి, లోకేష్ లతో పాటు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఇలా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి భర్తను చూడగానే భువనేశ్వరి తట్టుకోలేకపోయారని... భావోద్వేగానికి గురయినట్లు తెలుస్తోంది. గత నెలరోజులకు పైగా జైల్లో వుంటున్న భర్తను భువనేశ్వరి చాలాసార్లు కలిసారు... కానీ ఏనాడూ ఆమె ఇంతలా బాధపడింది లేదట. కనీసం కూర్చోడానికి కూడా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నాడని... అతడి ధీన పరిస్థితిని చూసి భువనేశ్వరి కన్నీటిపర్యంతం అయ్యారట.
ఎప్పుడు చంద్రబాబుతో ములాఖత్ అయినా జైలు వద్దే మీడియాతో మాట్లాడుతుంటారు ఆయన కుటుంబసభ్యులు. ఇలా శనివారం కూడా ములాఖత్ అనంతరం లోకేష్ లేదంటే భువనేశ్వరి మాట్లాడతారని అందరూ భావించారు. కానీ జైల్లో చంద్రబాబు పరిస్థితిని చూసిన కుటుంబసభ్యులు ఆ బాధలో మాట్లాడలేక పోయారు. మీడియాతో మాట్లాడకుండానే తల్లిని తీసుకుని లోకేష్ రాజమండ్రిలోని తన శిబిరం వద్దకు వెళ్ళిపోయాడు.