తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తమ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్‌రావు, కేసీఆర్‌కు లేదని అన్నారు.

తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తమ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్‌రావు, కేసీఆర్‌కు లేదని అన్నారు. వారి రాష్ట్రంలో బలహీనమైతున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయాలు తక్కువగా ఉన్నా అద్భుతంగా సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేస్తున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్దిపై చర్చకు సిద్దమా అని హరీష్‌రావుకు సవాలు విసిరారు. 

ఇదిలా ఉంటే.. అమరావతి రైతులపై అంబటి రాంబాబు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర కాదని.. ఒళ్ళు బలిసిన వాళ్ళు చేస్తున్న పాదయాత్ర అని చెప్పానన్నారు. ఇదే విషయాన్ని తాను మరోసారి చెబుతున్నానని అన్నారు. అది కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ విధానం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ది కోసం వైసీపీ సర్కార్ చూస్తుంటే.. టీడీపీ నాయకులు రైతుల ముసుగులో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

ఇక, ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్నపరిణామాలను ప్రస్తావిస్తూ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. . కానీ తెలంగాణలో మాత్రం టీచర్లకు 73 శాతం పిట్ మెంట్ ఇచ్చామన్నారు. ఏపీ ప్రభుత్వం వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగిస్తుందన్నారు. కేంద్రం షరతుల మేరకు వ్యవసాయ మోటార్లకు ఏపీ ప్రభుత్వం మీటర్లు బిగిస్తుందని ఆయన విమర్శించారు. ఇటీవల తిరుపతికి వెళ్లిన సమయంలో కొందరితో తాను మాట్లాడానన్నారు. విద్యుత్ విషయంలో తాముఇబ్బందులు పడుతున్నట్టుగా ఏపీ వాసులు చెప్పిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. దీంతో తెలంగాణ నేతలను ఏపీకి పంపిస్తే తెలంగాణ ఏ రకంగా ముందుందో తెలుస్తుందన్నాని హరీష్ రావు అన్నారు.