Asianet News TeluguAsianet News Telugu

కుప్పంలో చంద్రబాబుది దౌర్జన్యమే.. మీ యాక్షన్‌కి మా రియాక్షన్ తప్పదు : అంబటి రాంబాబు హెచ్చరిక

కుప్పంలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. కుప్పం తన చేతి నుండి జారిపోతుందని చంద్రబాబుకి భయం కలిగిందని, అందుకే తరచూ అక్కడికి వెళ్తున్నారని ఆయన చురకలు వేశారు. 
 

minister ambati rambabu counter to tdp chief chandrababu naidu
Author
First Published Aug 26, 2022, 9:39 PM IST

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కుప్పం తన చేతి నుండి జారిపోతుందని చంద్రబాబుకి భయం కలిగిందని రాంబాబు దుయ్యబట్టారు. భయంతోనే ఎప్పుడూ లేని విధంగా తరచూ కుప్పంకి వెళ్తున్నారని, చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి గాలేరు నగరి ఎందుకు పూర్తి చెయ్యలేదని అంబటి నిలదీశారు. అధికారంలో ఉండగా పట్టించుకోకుండా ఇప్పుడు ఊరూరా తిరుగుతున్నారని... కుప్పంపై చంద్రబాబుకి ప్రేమ లేదని, రాజకీయ అవసరం మాత్రమేనని ఆయన ఆరోపించారు. 

33 ఏళ్లుగా అక్కడ సొంత ఇల్లు కట్టుకోలేదని, కనీసం అద్దె ఇల్లు కూడా లేదని, గెస్ట్ హౌస్ లో ఉంటున్నారంటూ అంబటి ధ్వజమెత్తారు. కుప్పంలో చంద్రబాబు జెండా పీకెయ్యడానికి ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ప్రెస్టేషన్ లో ఉన్నారంటూ మంత్రి సెటైర్లు వేశారు. మా ఇళ్ళల్లో, మా ప్రాంగణాల్లో మా పార్టీ జెండాలు కట్టుకుంటే చంద్రబాబుకి ఏమైందని రాంబాబు నిలదీశారు. దౌర్జన్యంగా మా జెండాలు బ్యానర్స్, ధ్వంసం చేసి మా కార్యకర్తల్ని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. మీ చర్యకు మా వాళ్ళ ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని అంబటి హెచ్చరించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువంటే చంద్రబాబుని చూస్తే తెలుస్తుందని మంత్రి సెటైర్లు వేశారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ చూస్తుంటే కుప్పంతో పాటు 175 స్థానాలు వైసీపీ గెలవబోతుందని అర్థం అవుతోందని రాంబాబు జోస్యం చెప్పారు. 

ఇక.. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు పీకేశారని ఆరోపించారు. మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్లుగా తిరిగి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని సజ్జల సెటైర్లు వేశారు. చంద్రబాబువి దరిద్రపు ఆలోచనలని.. పేదవాళ్లకి సంక్షేమ పథకాలు అందకుండా చేయడమే బాబు లక్ష్యమని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పేదల ఆకలి నిజంగా తీర్చాలనుకుంటే.. అన్న క్యాంటీన్‌ను 2014లోనే ఎందుకు ఏర్పాటు చేయలేదని సజ్జల ప్రశ్నించారు. 

Also Read:చంద్రబాబుకు భద్రత పెంపు:12+12 ఎన్‌ఎస్‌జీ కమెండోలతో సెక్యూరిటీ

నిన్నటి నుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన అంతా డ్రామా లా జరుగుతుందని ఆయన దుయ్యబట్టారు. గొడవ చేసింది వాళ్ళే.. వీరంగం చేసింది వాళ్ళే.. మళ్ళీ వైసీపీని పోలీసులను అంటున్నారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో జరిగిన అల్లర్లకు చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కుప్పంలో వైసీపీ కార్యకర్తలు శాంతియతంగా నిరసన తెలియజేశారని.. 30 ఏళ్లుగా కుప్పాన్ని చంద్రబాబు ఉక్కుపాదాల కింద నొక్కి పెట్టారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో ప్రజలు స్వేచ్చగా బ్రతుకుతున్నారని సజ్జల పేర్కొన్నారు. 

30 ఏళ్లుగా జరగని అభివృద్ధిని తాము మూడేళ్లలో చేశామని, కుప్పం ప్రజలు చంద్రబాబు వల్ల విసిగిపోయారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు వైసీపీకి మద్దతుగా నిలుస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇకపై కుప్పంలో చంద్రబాబుకి స్థానం లేదని తెలిసిపోయిందని, అందుకే రిజెక్ట్ చేసేశారని సజ్జల వ్యాఖ్యానించారు. ఇకపై చంద్రబాబు చొక్కాలు విప్పుకుని అరిచినా ఉపయోగం లేదని, ఇన్ని రోజులు కుప్పం ఎమ్మెల్యే గా ఉన్న చంద్రబాబు ఈరోజు ఆఫీస్ ప్రారంభించారని ఆయన సెటైర్లు వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios