ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసే దమ్ము లేక ఇతర పార్టీల‌తో పొత్తు పెట్టుకోవడానికి ప్రతిపక్షనేత ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 

వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ హాట్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసే దమ్ము లేక ఇతర పార్టీల‌తో పొత్తుల‌తో పోటీ చేయడానికి చంద్ర‌బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని దుయ్యబట్టారు. అన్ని పార్టీలు క‌లిసి రావాల‌ని ఆయ‌న ఎందుకు అంటున్నార‌ని అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. ప‌న్నులు విధిస్తూ ప్ర‌జ‌లను ఇబ్బంది పెడుతున్నార‌ని చంద్ర‌బాబు అంటున్నార‌ని, పన్నులు లేకుండా ప్రభుత్వాలు నడుస్తాయా? అని ఆయ‌న నిలదీశారు. 

గతంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలో చంద్రబాబు పన్నులు లేకుండానే ప్రభుత్వాన్ని నడిపారా? అని మంత్రి నిల‌దీశారు. ఏపీలో నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదని ఆయ‌న భావిస్తున్నార‌ని, ఆయ‌న‌కు ఎల్లో మీడియా మ‌ద్ద‌తుగా నిలుస్తోంద‌ని అంబ‌టి ఆరోపించారు. చంద్ర‌బాబు నాయుడి ప‌ర్య‌ట‌న‌పై ప్ర‌జ‌ల నుంచి స్పందన లేకపోయినప్పటికీ జ‌నాలు త‌ర‌లివ‌స్తున్నారంటూ ఎల్లో మీడియా అస‌త్యాలు చెబుతోంద‌ని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై TDP చీఫ్ Chandrababu Naidu శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమం రావాలి, టీడీపీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే ఓ మెట్టు దిగుతానన్నారు. ఎంతటి త్యాగానికైనా సిద్దమేనని ఆయన తేల్చి చెప్పారు.

జనసేన (janasena) చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్ధించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తాను ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారానికి తెర తీసింది. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. 

గతంలో కుప్పంలో చంద్రబాబు టూర్ సమయంలో కూడా జనసేనతో పొత్తుపై ఓ కార్యకర్త ప్రశ్నించారు. అయితే వన్ సైడ్ లవ్ సరైంది కాదని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ప్రకటించారు.