ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కల్యాణే తనకు సీఎం పదవి వద్దు.. ఎవ్వరూ మాట్లాడొద్దు అంటున్నారంటూ చురకలంటించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారని, ఆయనతో ఏం డీల్ కుదిరిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్యాకేజ్ స్టార్ కాకపోతే వాళ్లతో ఎందుకు కలుస్తున్నారని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు కోసం కాపులు పెద్దన్న పాత్ర పోషించాలా అని రాంబాబు నిలదీశారు. రాజకీయాల్లో హత్యలు వుండవని, అన్నీ ఆత్మహత్యలేనన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని.. పార్టీ పెట్టినప్పుడు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదని చురకలంటించారు. పవన్ కన్నా సకల కళాకోవిదుడు ఎవరూ లేరని.. ముద్రగడను చిత్రహింసలు పెడుతుంటే పవన్ మాట్లాడలేదేమని రాంబాబు ప్రశ్నించారు.
కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదని.. కాపుల వ్యతిరేక పార్టీ టీడీపీ అని ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని పవన్ తాపత్రయమని.. కాపులను అణిచివేసే పార్టీ టీడీపీ అని రాంబాబు ఆరోపించారు. జగన్ కాపులకు అండగా నిలుస్తున్నారని..చంద్రబాబు అంత మోసగాడు దేశంలోనే ఎవరూ లేరని.. పవన్ అంత అసమర్ధుడు, అబద్ధాల కోరు ఎవరూ లేరని అంబటి తీవ్రవ్యాఖ్యలు చేశారు. సింగిల్‌గా వచ్చినా , కలిసొచ్చినా చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు. చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేసే స్థాయికి వెళ్లారని అంబటి రాంబాబు అన్నారు.
Also Read: ఈసారి ఖచ్చితంగా పొత్తులతోనే .. సీఎం ఎవరవ్వాలో ఎన్నికల తర్వాత చూద్దాం : పవన్ వ్యాఖ్యలు
ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ చేతులెత్తేశారని.. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ పనిచేస్తున్నారంటే ఎవ్వరూ నమ్మలేదని అంబటి రాంబాబు అన్నారు. 24 గంటలు రాజకీయం చేస్తుంటేనే అంతంత మాత్రంగా వుంటుందని.. అలాంటిది డబ్బులు తీసుకుని షూటింగ్‌లు చేసుకుంటే బలం పెరుగుతుందా అని మంత్రి ప్రశ్నించారు. సింగిల్‌గా పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిపోతానన్న పవన్ వెంట కాపులు ఎందుకు రావాలని రాంబాబు నిలదీశారు. పవన్ కల్యాణే తనకు సీఎం పదవి వద్దు.. ఎవ్వరూ మాట్లాడొద్దు అంటున్నారంటూ చురకలంటించారు.
