ఈసారి ఎన్నికల్లో పొత్తులు ఖచ్చితంగా వుంటాయన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అలాగే ఈసారి వైసీపీయే మన ప్రత్యర్ధి అని ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈసారి ఎన్నికల్లో పొత్తులు వుంటాయన్న పవన్ కల్యాణ్.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన సిద్ధంగా లేదని ఆయన పేర్కొన్నారు. తనకు ఏ పార్టీపైనా ప్రేమ , ద్వేషం లేదన్న ఆయన.. ఈసారి జనసేనకు ప్రత్యర్ధి వైసీపీయేనని స్పష్టం చేశారు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది తర్వాత చూద్దామని.. ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని దించడమే టార్గెట్ అని పవన్ పేర్కొన్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు వస్తాయని అంటున్నారని.. జూన్‌లో తాను ప్రచారం మొదలుపెడతానని పవన్ తెలిపారు.
బలమున్న స్థానాల్లో ఎన్నికలకు వెళదామని.. మనకు వచ్చే స్థానాలను బట్టే సీఎం పదవి గురించి అడగటానికి వీలుంటుందన్నారు. పొత్తులు పెట్టుకోవడం వల్ల పార్టీ ఎదుగుతుందని.. 6 నుంచి 7 స్థానాలు గెలుస్తూ వచ్చిన బీఆర్ఎస్ నేడు జాతీయ పార్టీగా ఎదిగిందన్నారు. కాపులను వైసీపీ నాయకులు తిట్టినప్పుడు, రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పినప్పుడు.. 60 శాతం మంది కాపులు జగన్‌కు ఓటు ఎందుకు వేశారని పవన్ ప్రశ్నించారు. ఏపీకి కావాల్సింది మంచి నాయకులు కాదని.. జనంలోనే పరివర్తన రావాలని ఆయన సూచించారు.
చంద్రబాబు నాయుడు తనను మోసం చేస్తారని అంటున్నారని.. తానేమైనా చిన్నపిల్లాడినా మోసపోవడానికి అని పవన్ ప్రశ్నించారు. తనకు వయసు పెరిగిందని, గడ్డం నెరిసిందని .. ఏం తెలియకుండానే పార్టీలు పెట్టేసి, రాజకీయాల్లోకి వచ్చేస్తానా ఆయన ప్రశ్నించారు. సినిమాలు చేసుకుంటే రోజుకు రెండు కోట్లు సంపాదిస్తానని కానీ అన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు.
