2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. తాను పుట్టింది రేపల్లె అయినా, చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనే అన్నారు. కాపులకు పట్టిన శని పవన్ కల్యాణ్ అని అంబటి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాను పుట్టింది రేపల్లె అయినా, చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనే అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. సత్తెనపల్లి ప్రజలు తనకు అపారమైన గౌరవం ఇచ్చారని తెలిపారు. కాపులకు పట్టిన శని పవన్ కల్యాణ్ అని అంబటి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ స్థాపించిన జనసేన పార్టీ వేలంపాటలో అమ్మకానికి సిద్ధంగా వున్న పార్టీ అన్నారు. దానిని బీఆర్ఎస్ , టీడీపీ, బీజేపీ.. ఎవరు ఎక్కువ పాట పాడితే వారికి అమ్ముడు పోతుందంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదని రాంబాబు స్పష్టం చేశారు.
అంతకుముందు మార్చి 5న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు అంబటి రాంబాబు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష చేపట్టారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తొందరపాటుతో పోలవరం ప్రాజెక్ట్‌కు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. గోదావరికి వచ్చిన వరదలు డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించడం.. అప్పర్, లోయర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయకపోవడం వల్ల.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అంబటి అన్నారు.
తాను రాజకీయ ఆరోపణలు చేయడం లేదని మంత్రి చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అవగాహన లేకనో, తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయాలనో కాపర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వేయటం వలన అనర్థం జరిగిందనేది నిపుణుల అభిప్రాయం అని రాంబాబు చెప్పారు. డయాఫ్రమ్ వాల్ వేసి.. కాపర్ డ్యామ్‌లు కట్టకపోయిన ఇంత అనర్థం జరిగేది కాదన్నారు. డయాఫ్రమ్‌వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమేనని మంత్రి అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతుందని రాంబాబు చెప్పారు. గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూసెక్కుల ఇసుక అవసరం అని అంబటి చెప్పారు.
