విశాఖపట్నం: మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు పాడేరులో స్థల పరిశీలన చేపట్టారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. పట్టణంలోని  ప్రభుత్వ పాలిటీక్నిక్ కాలేజీ సమీపంలో ఖాళీగా ఉన్న 50ఎకరాల స్థలాన్ని బుధవారం ఉదయం మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాసు, అరకు ఎంపీ మాధవి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అదనంగా మరో 16ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నమన్నారు. ఇలా రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు.  

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు .ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న జిల్లా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ ను భోధనా హాస్పిటల్స్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారని పేర్కొన్నారు. రానున్న మూడు సంవత్సరాలలో కొత్తగా మంజూరు అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 

read more  జగన్ సర్కార్‌కు సుప్రీం షాక్: ఏపీ సర్కార్ పిటిషన్ కొట్టివేత, 4 వారాల్లో రంగులు తొలగించాలి

ఇకపై గ్రామ సచివాలయాల్లోనూ ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే తక్షణమే ఉచితంగా వైద్యం అందించడానికి విలెజ్ క్లినిక్ లు దోహతపడతాయిన్నారు. ప్రతి టీచింగ్ హాస్పిటల్స్ లో డెంటల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అత్యదునిక పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించడానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నామన్నారు. స్థల పరిశీలనాలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు,  పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పాయకరావు పేట ఎమ్మెల్యే బాబురావు, అరకు ఎమ్మెల్యే చిట్టి ఫాల్గున పాల్గొన్నారు.