గురువుల కన్నా గూగుల్ మిన్న..!: టీచర్స్ డే వేడుకల్లో ఏపీ మంత్రి సంచలనం
ఉపాధ్యాయ దినోత్సవం రోజులు గురువుల కంటే గూగుల్ మిన్న అనేలా మాట్లాడారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.

ఒంగోలు : చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పించే గురువులను దేవుళ్లలా భావించే సంస్కృతి మనది. అలాంటిది స్వయంగా గురు పూజోత్సవం (టీచర్స్ డే) రోజునే ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ టీచర్లను తక్కువచేసేలా మాట్లాడారు. ఆధునిక పరిజ్ఞానం, సాంకేతికత నేటి తరానికి అందుబాటులోకి వచ్చిందని చెబుతూనే ఇక ఉపాధ్యాయుల అవసరం విద్యార్థులకు లేదనేలా మంత్రి మాట్లాడారు. ఉపాధ్యాయుల ముందే వారి వృత్తినే తక్కువచేసి మాట్లాడుతూ మంత్రి సురేష్ వివాదంలో చిక్కుకున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రస్తుత ఆధునిక కాలంలో గురువుల పాత్ర తగ్గిపోయిందని అన్నారు. గురువుల స్థానంలో గూగుల్ వచ్చిందని... దీంతో విద్యార్థులకు టీచర్ల అవసరం పెద్దగా లేకుండా పోయిందన్నారు. ఉపాధ్యాయులకు తెలియని విషయాలను కూడా గూగుల్ చెబుతుందన్నారు. ఇలా గురువుల కన్నా గూగుల్ మిన్న అనేలా మంత్రి మాట్లాడారు.
Read More ఆ కారణంతోనే ఉపాధ్యాయుల వేతనాలు ఆలస్యం.. మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సాంకేతికతను అందుబాటులోకి తెస్తోందని... అందులో భాగంగానే ట్యాబ్ లు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. బైజూస్ తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు అధునాతన విద్య అందిస్తోందని అన్నారు. ఇలా ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.