విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో పలువురు వలస కూలీలు గాయపడ్డారు. నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. కొంత మంది వలస కూలీలు నడుచుకుంటూ, మరికొంత మంది సైకిళ్లపై తమ స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారంనాడు చూశారు. 

వలస కూలీలతో ఆమె మాట్లాడారు. ఆ తర్వాత అధికారులతో మాట్లాడి వలస కూలీలకు పునరావాస కల్పించి, వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో వారికి అధికారులు విజయవాడ క్లబ్ లో పునరావాసం కల్పించారు. వారికి శనివారం ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. 

అల్పాహారం అందడంలో ఆలస్యం కావడంతో దాదాపు 150 మంది కూలీలు బయటకు వచ్చి తమ స్వస్థలాలకు దారి పట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిపై లాఠీచార్జీ చేశారు. దాంతో వారు తలో దిక్కు పరుగెత్తారు. ఆ తర్వాత వారిని విజయవాడ క్లబ్ కు చేర్చారు. వారి వివరాలను సేకరించారు.

ఉత్తరప్రదేశ్,  ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస కూలీలు వచ్చారు. తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నారు. తమను పోలీసులు విచక్షణారిహతంగా కొట్టారని వలస కూలీలు ఆరోపిస్తున్నారు.