అమరావతి: ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసి ప్రధాన మంత్రి ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పిఎంఈజిపి) పేరుతో కొందరు అనంతపురం జిల్లాలో మోసాలు చేస్తున్న విషయం తెలుసుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పద్ధతి, విధానాలు పక్కనపెట్టి మోసాలు చేయాలని ప్రయత్నించేవారెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మేకపాటి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలనే తేడా లేకుండా  అందరికీ ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. 

9686333999 ఫోన్ నంబర్ నుండి లేదా తెలియని నంబర్ల నుంచి  ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ( పియంఈజిపి) పేరుతో రుణాలు మంజూరు చేస్తామని, ముందుగా పెట్టుబడి క్రింద 10% శాతం మేము చేప్పినా  బ్యాంకు అకౌంటులో సొమ్ము జమ చేస్తే.. మీకు 25 లక్షలు నుండి 3 కోట్ల రూపాయలు వరకు రుణాలు మంజూరు చేయిస్తామని ఎవరికైనా ఫోన్ లు వచ్చినా, పరిచయంలేని వ్యక్తులు ప్రత్యక్ష్యంగా కోరినా వెంటనే అప్రమత్తమవ్వాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు. 

read more   యువతకు వాటిపైనా శిక్షణ ఇవ్వండి...: నైపుణ్యాభివృద్దిపై సమీక్షలో సీఎం

పరిశ్రమల శాఖకు సంబంధించిన ఎటువంటి సమాచారమైనా ఆయా జిల్లాలోని జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రము ద్వారా స్పష్టతకు రావాలని మంత్రి మేకపాటి కోరారు.  అనంతపురం జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధికి ఇలాగే ఫోన్ చేసి కనకదుర్గాంభిక (ఫోన్ 957302511 మరియు 9502703642) పేరిట వున్న "అకౌంటు నెంబరు : 33264920024 & IFSC code SBIN0000996" రూ. 2 లక్షలు కట్టాలని అడగడాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి ఈ విధంగా ప్రస్తావించారు.  ఆ ప్రజా ప్రతినిధి అప్రమత్తమై జిల్లా జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించడం.. విచారణ జరిపిన జిల్లా మేనేజర్ సుదర్శన్ బాబు  జిల్లా పోలీస్ అధికారులకు  వెంటనే ఫిర్యాదు చేసిన అనంతరం మంత్రి గౌతమ్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారు. 

ప్రధాన మంత్రి ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ( పి.యం.ఈ .జి .పి) కొరకు ధరఖాస్తు చేసుకునేవారు, కావలసిన ధృవపత్రాలతో జిల్లా పరిశ్రమల కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.  ఏ ఇతర సందేహాలున్నా పరిశ్రమల శాఖ అధికారులతో మాత్రమే నివృత్తి చేసుకోవాలని మంత్రి మేకపాటి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పరిశ్రమల శాఖ ఇటువంటి మోసాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఉండి..తదనుగుణంగా చర్యలు చేపట్టాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.