Asianet News TeluguAsianet News Telugu

యువతకు వాటిపైనా శిక్షణ ఇవ్వండి...: నైపుణ్యాభివృద్దిపై సమీక్షలో సీఎం

ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక కాలేజీ ఉండేలా చూసుకుంటూ రాష్ట్రంలో 30 కాలేజీల నిర్మాణం దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

AP CM YS Jagan Review Meeting on skill development
Author
Amaravathi, First Published Sep 1, 2020, 2:14 PM IST

అమరావతి: నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో సీఎంతో పాటు మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్‌ సెక్రటరీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక కాలేజీ ఉండేలా చూసుకుంటూ రాష్ట్రంలో 30 కాలేజీల నిర్మాణం దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నైపుణ్యాల అభివృద్ధి, ఉత్తమ మానవవనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్దిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. 

కాలేజీలకోసం ఇప్పటివరకూ దాదాపు 20 చోట్ల స్థలాల గుర్తించినట్లు మిగిలిన చోట్ల కూడా చురుగ్గా స్థలాల ఎంపిక ప్రక్రియ చేస్తున్నామన్నామని అధికారులు సీఎంకు వివరించారు. అయితే స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం వారిని ఆదేశించారు. భవనాల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు సీఎం. 

read more  ఏపీకి ఊరట: పోతిరెడ్డిపాడుపై సుప్రీంలో తేలేవరకు విచారణ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

స్కిల్‌ డెవలప్‌ మెంట్‌కాలేజీల్లో కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీపై సీఎం ఆరాతీశారు. వివిధ రకాల కోర్సులకు సంబంధించిన పాఠ్యప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. ఫినిషింగ్‌ స్కిల్‌ కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఇలా రెండు రకాలుగా స్కిల్‌ కాలేజీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు... మొత్తం 162కి పైగా కోర్సుల ద్వారా ఈ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్‌ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 

పరిశ్రమల అవసరాలపై సర్వే చేపట్టి దాని ప్రకారమే కోర్సులను నిర్ణయించామని అధికారులు వివరించారు. పాఠ్యప్రణాళిక తయారీలో 4 అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకున్నామన్నారు. సింగపూర్‌ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్‌  హాల్‌ లారెన్‌స్టెన్‌ (యూనివర్శిటీ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌), డిపార్ట్‌ మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ భాగస్వామ్యాన్ని తీసుకున్నామని తెలిపారు. అలాగే మరో 23 ప్రఖ్యాత సంస్థలు భాగస్వామ్యమయ్యాయని... వారితో ఎంఓయూలకు సిద్ధమయ్యామని తెలిపారు. మరో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయని సీఎంకు వివరించారు అధికారులు. 

ల్యాబ్‌ ఏర్పాట్లు, పాఠ్యప్రణాళికలో వీరి సహకారం తీసుకుంటున్నామన్నారు. ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బియోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయన్నారు అధికారులు. 

పరిశ్రమలతో పాటు వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపైనా శిక్షణ ఇవ్వాలన్న సీఎం సూచించారు. ఆర్థికశాఖ అధికారులతో కూర్చుని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని పనులు త్వరగా మొదలుపెట్టాలని సీఎం ఆదేశించారు. హై ఎండ్‌స్కిల్స్‌తో పాటు ప్రతి కాలేజీలో కూడా ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపైనా యువతకు శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios