ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. ఈరోజు ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. ఈరోజు ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.45 నిమిషాలకు అపోలో అసుపత్రికి చేరుకోగా.. 90 నిమిషాల పాటు వైద్యులు గౌతమ్‌రెడ్డికి ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు,  అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2వ తేదీన గౌతమ్ రెడ్డి జన్మించారు. ఆయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు. గౌతమ్ రెడ్డి  స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండం బ్రాహ్మణపల్లి. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో గౌతమ్ రెడ్డి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వైసీపీ ఆరంభం నుంచి మేకపాటి కుటుంబం వైఎస్ జగన్‌తోనే ఉంది. నెల్లూరు జిల్లా నుంచి పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. 

మేకపాటి గౌతమ్‌రెడ్డి తన తండ్రి రాజమోహన్‌రెడ్డి అడుగు జాడల్లో  2014లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచిన గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 

మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం విషయానికి వస్తే.. ఆయన తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి. ఆయనకు భార్య మేకపాటి శ్రీకీర్తి, కూతురు అనన్య రెడ్డి, కుమారుడు అర్జున్ రెడ్డి ఉన్నారు. కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే అర్జున్ రెడ్డి స్వదేశానికి బయలుదేరేందుకు సిద్దమయ్యారు. అర్జున్ రెడ్డి రేపు స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్ మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) ఈ రోజు హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటుతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరిన గౌతమ్ రెడ్డి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మరికాసేపట్లలోనే గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. 

అనంతరం ఈరోజు రాత్రికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సొంత జిల్లా నెల్లూరు తరలించనున్నారు. ఎల్లుండి నెల్లూరు జిల్లాలోని సొంతూరు బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.   

ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.