ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వలేదు, వాడుకుని వదిలేశారు.. అన్నాదమ్ములపై విరుచుకుపడ్డ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన అన్నాదమ్ముల మీద విరుచుకుపడ్డారు. ఆస్తిలో తనకు చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మర్రిపాడు : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన అన్నదమ్ములైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. వారసత్వంగా తనకు రావాల్సిన ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తన అన్నదమ్ములు రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తనను ఇంటి నుంచి గెంటేసారని ఆక్రోషం వెళ్లగక్కారు. ఆదివారం మర్రిపాడులోని తన నివాసంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
విలేకరులతో మాట్లాడుతూ.. తాము ముగ్గురం అన్నదమ్ములమని తెలిపారు. గతంలో ఒకసారి ముగ్గురం కలుసుకున్నామని ఎవరెవరికి ఎంత వాటా రావాలో చర్చించుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే తన అన్న, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆనాడు చెప్పిన విధంగా ఎన్ని రోజులు గడిచినా.. ఇప్పటికీ ఆస్తులు పంపిణీ చేయలేదని అన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం భవిష్యత్తు కోసం, రాజకీయ పదవి కోసం ఆస్తి పంపకాలు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపణలు గుర్తించారు.
గణేష్ నిమజ్జనానికి తమ కంటే ముందే వెళ్లారని దళితులపై దాడి.. శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన
తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లైనా సరే తన ఆస్తిలో హక్కు సాధించుకుంటానని అన్నారు. ఉదయగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. ఈ బాధ్యతలతోనే ఎమ్మెల్యే అయినట్లుగా రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో 2024లో జరిగే ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో లేదో కూడా తెలియదని అన్నారు. తనకైతే ఆ నమ్మకం కూడా లేదన్నారు.
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ రాజగోపాల్ రెడ్డి ఎంత మోసగాడో తెలుసని చెప్పుకొచ్చారు. బెంగళూరుకి రావాలని ఆస్తి పంపకాలు చేసుకుందామని పిలిచారని.. అయితే తాను తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వారెవరు అందుబాటులో లేకుండా పోయారని.. తనను తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని.. దీనివల్లే తనకు గుండెపోటు వచ్చిందని ఆరోపించారు. ‘పిల్లికి బిక్షం పెట్టని వీరు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఏం మేలు చేస్తారని’ ప్రశ్నించారు.
‘ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎమ్మెల్యే పదవి త్యాగం చేశాను. జగన్ జన్మదిన వేడుకల కోసం, వైసీపీ ప్లీనరీ సమావేశాల కోసం నా సొంత నిధులు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశాను. నేను పార్టీ కోసం ఇంత పాటు పడ్డాను. కానీ ముఖ్యమంత్రి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గానికి తీపి ఇన్చార్జిని పెట్టుకోవడానికి మూడు నెలలు పట్టింది’అని పార్టీ మీద విరుచుకుపడ్డారు.
ఇక తన అన్నదమ్ముల గురించి మాట్లాడుతూ.. తాను కత్తులు, గొడ్డలి పట్టుకుని పోరాటం చేస్తేనే తన అన్నదమ్ములు ఇద్దరికీ రాజకీయ భవిష్యత్తు వచ్చిందన్నారు. తన మొదటి భార్య పిల్లలు, ఆస్తిపాస్తుల్ని రాజగోపాల్ రెడ్డి, రాజ మోహన్ రెడ్డిలే తనకు దూరం చేశారని అన్నారు. ఇప్పుడు తనను ఇంత క్షోభ పెట్టిన వారికి తానే వ్యతిరేకంగా నిలబడతానని.. ఇకమీదట వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పుకొచ్చారు.