Asianet News TeluguAsianet News Telugu

నేను ఏ పక్షంలో వున్నా పవన్‌కి ఇబ్బందే.. అందుకే రాజకీయాలను వదిలేశా : చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ పొలిటకల్ జర్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. చెరో పక్క ఉండకూడదనే.. తానే రాజకీయాల నుంచి తప్పుకున్నానని, పవన్ రాజకీయంగా ఎదిగేందుకే తాను బయటకు వచ్చానని చిరు చెప్పారు.

megastar chiranjeevi sensational comments on pawan kalyan political career
Author
First Published Oct 4, 2022, 2:17 PM IST

తన తమ్ముడు  పవన్ కల్యాణ్‌ సారథ్యంలో నడుస్తోన్న జనసేన పార్టీకి మద్ధతు ఇవ్వడానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు మద్ధతు ఇస్తానో, ఇవ్వనో భవిష్యత్తే నిర్ణయించాలన్న ఆయన.. పవన్ కల్యాణ్ లాంటి నిబద్ధత వున్న నాయకుడు రావాలని ఆకాంక్షించారు. తన ఆకాంక్ష కూడా అదేనన్న చిరు.. దానికి తన మద్ధతు వుంటుందన్నారు. మేం చెరోవైపు వుండటం కంటే తాను తప్పుకోవడమే తనకు హెల్ప్ అవుతుందేమోనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. 

నా తమ్ముడు.. మంచి నాయకుడు అవుతాడని మెగాస్టార్ జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావొచ్చని ఆయన అన్నారు. పవన్ నిజాయితీ, నిబద్ధత తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని చిరు తెలిపారు. చెరో పక్క ఉండకూడదనే.. తానే రాజకీయాల నుంచి తప్పుకున్నానని, పవన్ రాజకీయంగా ఎదిగేందుకే తాను బయటకు వచ్చానని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో తాను ఏ పక్షాన వుంటాననేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు చిరంజీవి.

కాగా... చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.  అయితే ఇప్పుడు ఈ చిత్రం సినీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. కుటిల రాజకీయ శక్తుల ప్రక్షాళన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళ చిత్రం లూసిఫర్‌కు గాడ్‌ ఫాదర్ రీమేక్ కావడమే. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో గాడ్ ఫాదర్ చిత్రంలో.. డైలాగ్‌లు కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. చిత్ర ప్రమోషన్‌ భాగంగా విడుదల చేసిన ట్రైలర్, డైలాగ్‌లు సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. 

ALso Read:ప్రజల సొమ్ము అడ్డంగా తిని బలిసి కొట్టుకుంటున్నారు.. హాట్ టాపిక్‌గా మారిన చిరు ట్వీట్స్.. గాడ్‌ ఫాదర్‌పై హైప్..

రాజకీయాలకు నేను దూరంగా వున్నా.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పుట్టించాయి. ఇంతలోనే చిరంజీవికి కొత్త ఐడీ కార్డ్ జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 2027 వరకు పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ ఐడీ కార్డ్ ఇచ్చింది. రాజకీయాలపై చిరంజీవి కామెంట్స్ చేసిన తర్వాతి రోజే ఈ ఐడీ కార్డ్ రావడంతో మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ వుంటుందా అని జోరుగా చర్చ జరుగుతోంది. 

అప్పటి నుంచే గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్‌ను సోషల్ మీడియాలో, సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా ప్రస్తావించడంతో చిరంజీవి అభిమానులతో పాటు, పవన్ అభిమానులు కూడా సంబరపడిపోతున్నారు. గత బుధవారం అనంతపురంలో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్‌లో కూడా చిరంజీవి.. సినిమాలోని డైలాగ్‌లు చెప్పి అభిమానులను ఉత్సహపరిచారు. అంతేకాకుండా వర్షంలోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

‘‘నేనెప్పుడూ సీమకు వచ్చిన ఆ నేల తడుస్తుంది. పులివెందులలో పొలిటికల్ క్యాంపెయిన్ నిర్వహించినప్పుడు.. ఇంద్ర సినిమా షూటింగ్‌లోనూ వర్షం కురిసింది. ఈరోజు కూడా వర్షం పడటం శుభపరిణామం’’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఇటీవల వదలిన డైలాగ్‌పై చర్చలు, డిబేట్లు ఎన్నో జరిగాయని చెప్పారు. అదే సమయంలో వేదికపై నుంచి మరో డైలాగ్‌ను చెప్పి అభిమానుల్లో జోష్ నింపారు.

చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ.. పరోక్షంగా తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఏపీ పునర్విభజన తర్వాత కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో కనిపించారు. అయితే చాలా కాలంగా ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే పలుమార్లు చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ వార్తలు వచ్చాయి.  కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సమయంలో కూడా చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై చర్చ సాగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios