దేశంలో సంచలనం సృష్టించిన ‘ఓటుకునోటు’ కేసులో చంద్రబాబునాయుడుకు షాక్ తప్పదా? సుప్రింకోర్టు వేదికగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ‘ఓటుకునోటు’ కేసులో కీలకమైన మత్తయ్య తనను అప్రూవర్ గా మారేందుకు అనుమతించాలంటూ సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలు చేయటం చంద్రబాబుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఓటుకునోటు కేసులో మత్తయ్య ఏ 4గా ఉన్నారు.

మత్తయ్య విజ్ఞప్తిని గనుక ఒకవేళ సుప్రింకోర్టు ఆమోదిస్తే మొత్తం కేసు మలుపులు తిరగటం ఖాయం. ఎందుకంటే, ఇప్పటి వరకూ తనకు కేసులో సంబంధం లేదని చంద్రబాబు వాదిస్తున్నారు. తెలంగాణాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో అవకాశం లేకపోయినా టిడిపి అభ్యర్ధిని పోటీకి దింపింది. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతో ఎంఎల్ఏల కొనుగోళ్ళకు తెరలేపింది.

అందులో భాగంగానే నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ తో బేరం కుదుర్చుకున్నది. ఆయన ఓటుకు రూ. 5 కోట్లు వెలకట్టిన టిడిపి అడ్వాన్ప్ గా రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నది. రూ. 50 లక్షలు ఇచ్చే సమయంలోనే తెలంగాణా ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికేశారు. అప్పటి నుండి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తనకు కేసుతో ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు వాదిస్తున్నారు. అందుకనే తనపై విచారణ జరగకుండా స్టే కూడా తెచ్చుకున్నారు.

ఈ కేసు మొత్తం మీద మత్తయ్య చాలా కీలకం. ఎందుకంటే, స్టీఫెన్ సన్ ను చంద్రబాబును ఫోన్లో కలిపిందే మత్తయ్యగా ప్రచారం జరుగుతోంది. అందుకనే మత్తయ్య నోరిప్పకుండా గుర్తు తెలీని వ్యక్తుల నుండి ఫోన్లు వస్తున్నట్లు మత్తయ్యే చెప్పారు. అంతేకాకుండా మత్తయ్య ఎవరికీ దొరక్కుండా తిరుగుతున్నారు. కేసులో తాను అప్రూవర్ గా మారేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఇపుడు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు మత్తయ్య రాసిన లేఖ టిడిపిలో కలకలం రేపుతోంది. మరి, సుప్రింకోర్టు ఏమంటుందో చూడాలి.