వివాహితపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడి అతి దారుణంగా హత్యచేసిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 

విశాఖపట్నం : వివాహితపై అత్యంత పాశవికంగా లైంగికదాడికి దిగారు గుర్తుతెలియని దుండగులు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి చివరకు ప్రాణాలు బలితీసుకున్నారు దుర్మార్గులు. ఈ దారుణం విశాఖపట్నం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామంతో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత(32) నివాసముండేది. గ్రామ సమీపంలోని ఓ కంపనీలో ఆమె పనిచేసేది. ఇటీవల ఎప్పటిలాగే ఉదయం పనిచేసే కంపనీకి వెళ్లిన ఆమె రాత్రి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిపోయిన భర్త, కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. 

అయితే ఈ నెల 11న(ఆదివారం) రాత్రి విశాఖ జిల్లా తగరపువలస సమీపంలో ఓ మహిళ మృతదేహం పడివున్నట్లు భీమిలి పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే జాతీయ రహదారి సమీపంలోని చెట్లపొదల్లో తీవ్ర గాయాలతో పడివున్న మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Read More పెళ్లయిన వ్యక్తితో ప్రేమ.. దూరం పెట్టాడని, బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య

ఈ మృతదేహం విజయనగరంలో జిల్లాలో మిస్సయిన వివాహితదిగా గుర్తించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఒంటిపై గాయాలను బట్టి ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానించగా పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా అదే తేలింది. ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూ అత్యాచారానికి పాల్పడినట్లు... అనంతరం విషయం బయటపడకుండా హత్యచేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. 

కనిపించకుండా పోయిన వివాహిత ఇలా మృతదేహంగా తిరిగిరావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి మృతదేహం వద్ద ఇద్దరు బిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించడం చూసేవారితో కన్నీరు పెట్టిస్తోంది.