వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక.. మహిళ ఆత్మహత్య.. రెండు నెలల క్రితం సోదరుడు కూడా..
వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఓ వివాహిత బావిలో దూకింది. అయితే, పోలీసులు ఆమె మృతదేహాన్ని భర్తను, కుటుంబసభ్యులను చూడనివ్వకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
విశాఖపట్నం : వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని కూడా చూడకుండా భర్తను, బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో జరిగిన ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. ముదపాక పంచాయతీ గోవిందపురం గ్రామానికి చెందిన సారిపల్లి భీమేశ్వరరావు, సోమేశ్వరరావు, కడియాల అచ్చమ్మ (36) తోబుట్టువులు. సోదరులు ఇద్దరు గ్రామంలోని రెండు సెంట్ల స్థలాన్ని అచ్చియ్యమ్మకు బహుమానంగా ఇచ్చారు. కొన్నాళ్లుగా ఆ స్థలానికి సంబంధించి వీరికి, స్థానిక వైసీపీ నాయకులకు మధ్య వివాదం నడుస్తోంది.
వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక సోమేశ్వరరావు పురుగుల మందు తాగి ఈ ఏడాది సెప్టెంబర్ 9న చనిపోయాడు. అచ్చియ్యమ్మకు చెందిన రెండు సెంట్లను వుడా లేఅవుట్లో ఖాళీ స్థలంగా గుర్తించామని, 15 రోజుల్లో దాన్ని ఖాళీ చేయాలని ముదపాక పంచాయతీ కార్యదర్శి కె.నాగప్రభు ఈ నెల 2న నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచి అచ్చియ్యమ్మ తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. వారి నివాసానికి సమీపంలోని వ్యవసాయ బావిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
సార్.. సార్.. కేసులు మాఫీ చేయండి, మోడీని కలిస్తే జగన్ అడిగిది ఇదే : నారా లోకేశ్ సెటైర్లు
ఈ మేరకు సమాచారం అందుకున్న పెందుర్తి సిఐ గొలగాని అప్పారావు, ఎస్సై రాంబాబు, సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంటకు గోవిందపురం చేరుకున్నారు. బావిలో నీరు అధికంగా ఉండటంతో మోటార్లతో మంగళవారం ఉదయం 6:30 గంటలకు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అచ్చియ్యమ్మ మృతదేహాన్ని బయటకు తీయించారు.
కడసారి చూపు కూడా చూడనీయకుండా..
అచ్చియ్యమ్మ మృతదేహాన్ని బయటికి తీసుకు వస్తుండగా భర్త చిన్నారావు, సోదరుడు భీమేశ్వరరావు చూసేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు పక్కకు లాగేసి మృతదేహాన్ని అంబులెన్స్ లో పెట్టించారు. దీంతో వారు అంబులెన్స్ ఎదుట బైఠాయించారు. గ్రామస్తులు వాహనాన్ని చుట్టుముట్టడంతో పోలీసులు వారిని లాఠీలతో చెదరగొట్టారు. మృతదేహం ఉన్న అంబులెన్స్ ను గ్రామస్తులు మళ్లీ అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో డ్రైవర్ వేగంగా ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో గ్రామస్తులను చెదర గొడుతున్న ఎస్ఐ కాలి పై నుంచి అంబులెన్స్ వెళ్ళిపోయింది. ఆయన కాలు వెనక్కి వెళ్లి తిరిగి విరిగిపోయింది.
ముదపాక గ్రామంలో ల్యాండ్ పూలింగ్ అక్రమాలకు అడ్డుపడుతున్నారని సోమేశ్వరరావు, భీమేశ్వరరావు కుటుంబంపై వైసీపీ నాయకులు కక్ష కట్టారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. అచ్చియ్యమ్మ మృతి పై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా, రసీదు ఇవ్వకుండా పోలీసులు జాప్యం చేయడంతో పెందుర్తి స్టేషన్ కు చేరుకుని బండారు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులను నిలదీయడంతో ఎట్టకేలకు రసీదు ఇచ్చారు. అచ్చియ్యమ్మ మృతికి కారకులపై కేసులు నమోదు చేసే వరకు పోస్టుమార్టానికి అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సారిపల్లి గణేష్, సియ్యాద్రి బాలచంద్ర, ఇప్పిలి కనకరాజుపై ఐపీసీ సెక్షన్ 306, 34ల కింద కేసు నమోదు చేసినట్లు పెందుర్తి సీఐ గొలగాని అప్పారావు తెలిపారు.