Asianet News TeluguAsianet News Telugu

సార్.. సార్.. కేసులు మాఫీ చేయండి, మోడీని కలిస్తే జగన్ అడిగిది ఇదే : నారా లోకేశ్ సెటైర్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే కేసులు మాఫీ చేయమని జగన్ కోరుతారంటూ ఆయన ఆరోపించారు. 

tdp mlc nara lokesh slams ap cm ys jagan
Author
First Published Nov 15, 2022, 9:14 PM IST

సార్, సార్, సార్ కేసులు మాఫీ చెయ్యండి అంటూ ప్రధానిని వేడుకోవడం తప్ప రాష్ట్రం కోసం జగన్ రెడ్డి సాధించింది ఏమి లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. మంగళవారం ఉండవల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే ఆర్కేని రెండు సార్లు గెలిపిస్తే అభివృద్దిని గాలికోదిలేశారని దుయ్యబట్టారు. అవినీతి చెయ్యడంలోనూ, నటనలోనూ ఆర్కే బిజీగా ఉన్నారని నారా లోకేశ్ సెటైర్లు వేశారు. గెలిచిన వెంటనే ఇళ్ళ పట్టాలు ఇస్తానన్న ఎమ్మెల్యే ఆర్కే వందల సంఖ్యలో పేద ప్రజల ఇళ్లు కూల్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

40 ఏళ్లుగా ఇరిగేషన్, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి గెలిచిన ఏడాదిలో బట్టలు పెట్టి ఇళ్ళ పట్టాలు ఇస్తానని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. దేవుడి మాన్యం ప్రాంతంలో 48 గంటల్లోనే రోడ్డు వేయించి జంగిల్ క్లియరెన్స్ చేయిస్తానన్నారు. గతంలో స్థలం కేటాయించినా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయామని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న వారికి  పట్టాలు ఇస్తానని.. మౌలిక సదుపాయాలు అన్ని పక్కాగా ఏర్పాటు చేసే బాధ్యత నాదేనని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లి కొండపై గ్రావెల్ దోపిడి జరుగుతోందని.. అనుమతి గోరంత దోచింది కొండంత అని లోకేశ్ ఆరోపించారు. తాను గెలిచిన తర్వాత పేదలకు మంగళగిరి నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు నిర్మిస్తానని ఆయన తెలిపారు. 

ALso Read:ఆ రోడ్డంతా గతుకుల మాయం.. తక్షణం మరమ్మత్తులు చేయించండి : ఏపీ ప్రభుత్వానికి లోకేశ్ లేఖ

ఇకపోతే.. నారా లోకేష్ త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన పాదయాత్రపై నారా లోకేష్ స్పష్టతనిచ్చారు. 2023 జనవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ తన పాదయాత్ర ప్రారంభించేందుకు లోకేష్ సిద్దమయ్యారు. ఏడాది  పాటు ప్రజల్లో ఉండేల్లా లోకేష్ పాదయాత్రను ప్లాన్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర రూట్ మ్యాప్‌పై కసరత్తు తుదిదశకు చేరుకుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. 

ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి నారా లోకేష్ పాదయాత్ర ముగించేలా షెడ్యూల్‌ను రూపొందించనున్నారు. అన్ని ప్రాంతాలను సందర్శించేలా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా లోకేష్ పాదయాత్ర సాగనుంది. నారా లోకేష్ పాదయాత్ర ద్వారా పార్టీకి క్షేత్రస్థాయిలో జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీ కోసం పేరుతో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios