విజయనగరం జిల్లాలో వివాహిత అనుమాస్పద మృతి కలకలం రేపుతోంది. భర్త వివాహేతర సంబంధమే ఆమె మృతికి కారణంగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

విజయనగరం : అనుమానాస్పద రీతిలో వివాహిత మృతిచెందగా ఇందుకు భర్త అక్రమసంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లుడి వివాహేతర సంబంధమే తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. 

లక్కవరపుకోట మండలం మార్లాపల్లికి చెందిన చిన్నంనాయుడికి గంట్యాడ మండలం రాకోడు గ్రామానికి చెందిన రమ(26) తో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. పిల్లాపాపలతో హాయిగా సాగుతున్న వీరి సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. భర్తకు ఇంకెవరో మహిళతో సంబంధం వున్నట్లు రమ అనుమానం పెంచుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బాధపడేది. 

ఈ క్రమంలోనే హటాత్తుగా ఏమయ్యిందో తెలీదు గత శనివారం రాత్రి చిన్నంనాయుడు ఉద్యోగ పనుల్లో భాగంగా విశాఖపట్నం వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. దీంతో రాత్రి పిల్లలతో కలిసి పడుకున్న రమ ఉదయానికి మృతిచెంది కనిపించింది. ఇంట్లోనే ఉరికి వేలాడుతూ రమ మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు భర్తకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు ఇంటికి చేరుకుని భార్య మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించాడు. 

Read More షాకింగ్ ఘ‌ట‌న‌: చదువుకున్న భార్య ఎక్కడ తనను నిర్లక్ష్యం చేస్తుందోనని చంపేశాడు..

అయితే కూతురి ఆత్మహత్యకు భర్త చిన్నంనాయుడు, అత్తామామలే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు రమ తండ్రి రామకృష్ణ ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత తల్లిదండ్రుల అనుమానిస్తున్నట్లు చిన్నంనాయుడే భార్య హత్యకు కారణమా..? మరేవయినా ఇతర కారణాలు వున్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)