Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో జీ20 సదస్సు, జగన్ పర్యటన వేళ... మావోయిస్టుల లేఖ కలకలం

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక జీ20 సన్నాహక సదస్సు నిర్వహణ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది.  

Maoist leader Ganesh warning letter to AP Government AKP
Author
First Published Mar 29, 2023, 10:06 AM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో జీ20 సన్నాహక సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. విదేశాల నుండి భారీగా ప్రతినిధులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులంతా ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ మావోయిస్టులు విడుదల చేసిన బహిరంగ లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. 

ఇటీవల ఏపీ ప్రభుత్వం బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని నిర్ణయించి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది.ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే మావోయిస్టులు లేఖ విడుదల చేసారు. 

ఆదివాసి హక్కులను కాలరాసే కుట్రలో భాగంగానే బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మావోలు లేఖలో పేర్కొన్నారు. ఈ కుట్రను ఆదివాసీలు గుర్తించాలని... పోరాటం ద్వారా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాలని సూచించారు. ఈ మేరకు ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో మావోయిస్టుల లేఖ విడుదలయ్యింది. 

Read More  దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా,బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం

ఆదివాసి ఓట్లతో గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా బోయ, వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలిపి మోసం చేసారని అన్నారు. దోపిడీదారులకు సేవకులుగా ఎస్టీ ఎమ్మెల్యేలు మారారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. 

ఇదిలావుంటే ఇప్పటికే జీ20 సదస్స కోసం 40కి పైగా దేశాల ప్రతినిధులు, ముఖ్యమంత్రి జగన్ విశాఖకు చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి విశాఖకు చేరుకున్నారు సీఎం జగన్. రాత్రికి విశాఖకు చేరుకుని జీ -20 ప్రతినిధులతో భేటీ అయ్యారు. విదేశీ ప్రతినిధులతో  కలిసి సీఎం జగన్  భోజనం చేసారు. అనంతరం  అక్కడి నుండి  జగన్  తిరిగి  తాడేపల్లి  చేరుకున్నారు. 

విశాఖపట్టణం  వేదికగా  రాష్ట్రప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నెల  3,4 తేదీల్లో  విశాఖపట్టణంలో  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  నిర్వహించారు.  ప్రపంచంలోని  పలు దేశాల  నుండి  పలువురు  ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు.   ఈ సమ్మిట్ ద్వారా  పెద్ద ఎత్తున  పెట్టుబడులు  పెట్టేందుకు  పలు సంస్థలు  ముందుకు  వచ్చినట్టుగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

విశాఖపట్టణం నుండి పాలనను సాగించనున్నట్టుగా  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా మారనుందని సీఎం జగన్  ప్రకటించారు. ఇలాంటి కీలక సమయంలో విశాఖలో మావోయిస్టుల ప్రాబల్యం కనిపించడం కలకలం రేపుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios