Asianet News TeluguAsianet News Telugu

షర్మిల రాక , కాంగ్రెస్‌లో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు

వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఏపీలో కాంగ్రెస్‌లో చేరికలు మొదలయ్యాయి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు శెట్టి గంగాధర్, మరికొందరు వైసీపీ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు.

mangalagiri mla alla ramakrishna reddy joined in congress party in the presence of ap chief ys sharmila ksp
Author
First Published Jan 21, 2024, 4:04 PM IST

వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఏపీలో కాంగ్రెస్‌లో చేరికలు మొదలయ్యాయి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఆదివారం షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు శెట్టి గంగాధర్, మరికొందరు వైసీపీ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో టీడీపీ, వైసీపీలలో టికెట్ దొరకని నేతలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం వుంది. దీంతో రానున్న రోజులలో చేరికలు భారీగా వుంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో వైసీపీ ఇచ్చిన తీర్మానాన్ని గిడుగు రుద్రరాజు చదివి వినిపించారు. అనంతరం షర్మి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వస్తే.. ఉద్యోగాలు, పరిశ్రమలు వచ్చేవన్నారు. హోదా రావడం అనడం కంటే పాలకులు తీసుకురాలేకపోయారని అనడం కరెక్ట్ అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హోదా రావడం వల్ల 2 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని, 500 శాతం కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల 10 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని షర్మిల తెలిపారు. మరి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు రావడం లేదని ఆమె ప్రశ్నించారు. 

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ 5 ఏళ్లు హోదా ఇస్తామని అంటే బీజేపీ 10 ఏళ్లు ఇవ్వాలని ఊదరగొట్టారని షర్మిల ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు హోదా కావాలని చంద్రబాబు అన్నారని.. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని షర్మిల గుర్తుచేశారు. మోడీ కేబినెట్‌లో మంత్రి పదవులు తీసుకుని, సీఎం అయ్యాక హోదాను పక్కనపెట్టి ఉద్యమం చేసే వాళ్ల మీద కేసులు పెట్టారని ఆమె దుయ్యబట్టారు. జగన్ రెడ్డి ప్రతిపక్షనేతగా వున్నంత కాలం రోజూ హోదా అన్నారని, విపక్షంలో వున్నప్పుడు కేంద్రంపై అవిశ్వాసం పెడతానని అన్నారని షర్మిల గుర్తుచేశారు. టిడిపి మద్దతు ఇస్తే ..మూకుమ్మడి గా రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు హోదా అన్నారని ఆమె ఎద్దేవా చేశారు.

జగన్ రెడ్డి క్రైస్తవుడు అయ్యి ఉండి మణిపూర్ ఘటన మీద స్పందించలేదని, మణిపూర్‌లో 2 వేల చర్చిల మీద దాడులు జరిగితే ఒక్క రోజు కూడా విమర్శ చేయలేదని ఆమె మండిపడ్డారు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటే స్పందించలేదని షర్మిల ఫైర్ అయ్యారు. టిడిపి సైతం అదే వైఖరిలో వుందని, వైఎస్సార్ బీజేపీ పార్టీకి వ్యతిరేకి అని ఆమె గుర్తుచేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని.. మతం పేరుతో చిచ్చు పెట్టాలి.. చలి కాచుకోవాలి.. ఇదే బీజేపీ మంత్రమన్నారు. వైఎస్సార్ ఆశయాలు ఒక్క కాంగ్రెస్‌లోనే నెరవేరాయని, వైఎస్సార్‌ను ప్రేమించే ప్రజలు ఆయన ఆశయాల కోసం నిలబడదామని షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్ బిడ్డతో చేతులు కలపాలని.. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ ఆశయాలను సిద్దింపజేద్దామన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios