మంగళగిరి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల, కుప్పం తర్వాత ఎక్కువగా వినిపించేది మంగళగిరి పేరు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, భవిష్యత్ ముఖ్యమంత్రిగా టిడిపి నాయకులు పేర్కొంటున్న నారా లోకేష్ ఇక్కడినుండే పోటీ చేస్తున్నారు. కాబట్టి త్వరలో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు 2024 మంగళగిరి నియోజకవర్గ ఫలితం కీలకంగా మారనుంది. భవిష్యత్ రాజకీయాలపై ఈ నియోజకవర్గ ఓటర్ల తీర్పు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందువల్లే మంగళగిరి ఫలితంపై ప్రతిసారిలాగే ఈసారి కూడా ఉత్కంఠ నెలకొంది. 

మంగళగిరి రాజకీయాలు : 

మంగళగిరి అసెంబ్లీ పోరు ఈసారి మరింత రసవత్తంగా వుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాజీ మంత్రి నారా లోకేష్ ను ఓడించి ఈసారి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసిపి షాక్ ఇచ్చింది. ఈసారి మంగళగిరి వైసిపి టికెట్ ఆళ్లకు కాకుండా మహిళా నాయకురాలు మురుగుడు లావణ్యకు దక్కింది. బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాలకు చెందిన ఆమెను లోకేష్ పై బరిలోకి దింపింది వైసిపి. 

ముందుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో గంజి చిరంజీవిని మంగళగిరి ఇంచార్జీగా నియమించింది వైసిపి. దీంతో తీవ్ర అసహనానికి గురయిన ఆర్కే వైసిపిని వీడి కాంగ్రెస్ లో చేరారు. కానీ కొద్దిరోజుల్లోనే ఆళ్ల తిరిగి సొంతగూటికి చేరడం... మంగళగిరి ఇంచార్జీగా మురుగుడు లావణ్య నియామకం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇలా ఇంచార్జీలను మార్చడమే నారా లోకేష్ ను మరోసారి ఓడించడానికి వైసిపి ఎన్ని వ్యూహాలు రచిస్తుందో అర్థమవుతుంది. 

మంగళగిరి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి మురుగుడు లావణ్య : 

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు, మరో మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలే లావణ్య. అటు పుట్టిల్లు, ఇటు మెటినిల్లు మంగళగిరి రాజకీయాలతో ముడిపడి వుండటంతో లావణ్యను పిలిచిమరి టికెట్ ఇచ్చారు వైసిపి అధినేత వైఎస్ జగన్. నారా లోకేష్ లాంటి బలమైన నాయకున్ని మంగళగిరిలో అంతే బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన మహిళ చేతిలో ఓడించాలన్నది వైఎస్ జగన్ ఆలోచన. అందువల్లే సీనియర్లు ఆర్కే, గంజి చిరంజీవిని పక్కనబెట్టి లావణ్యను మంగళగిరి బరిలో నిలిపారు వైఎస్ జగన్. 

టిడిపి అభ్యర్థి నారా లోకేష్ : 

మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు, మరో మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, స్వయంగా మాజీ మంత్రి అయిన లోకేష్ అమెరికాలో చదువున్నారు. నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణితో వివాహం కాగా దేవాన్ష్ సంతానం. ఉన్నత చదువులు చదివినప్పటికీ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయ రంగప్రవేశం చేసారు. 2014 లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే మంత్రి పదవిని పొందారు లోకేష్. తన తండ్రి పలుకుబడితో ఎమ్మెల్సీగా నియమింపబడిన లోకేష్ మంత్రిగా పనిచేసారు. అయితే గత ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీచేసిన లోకేష్ వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఈసారి కూడా అదే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్నారు నారా లోకేష్. 

మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 : 

మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గ 2019 ఎన్నికల్లో 2,28,469 ఓట్లు పోలయ్యాయి... 85 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ ఎన్నికల ఫలితాలు ఇలా వున్నాయి.

వైసిపి ‌- ఆళ్ల రామకృష్ణా రెడ్డి ‌- 1,08,464 (47 శాతం) విజయం 

టిడిపి - నారా లోకేష్ - 1,03,127 (45 శాతం) ఓటమి 

సిపిఐ - ముప్పాళ్ళ నాగేశ్వరరావు -10,135 (4 శాతం) మూడో స్థానం 


మంగళగిరి అసెంబ్లీ ఫలితాలు 2014 :

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి సీటు వైసిపికే దక్కింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి అధికసీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన మంగళగిరి ప్రజలు మాత్రం వైసిపికే మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,98,941 ఓట్లు అంటే 85 శాతం పోలింగ్ నమోదయ్యింది.

వైసిపి ‌- ఆళ్ళ రామకృష్ణా రెడ్డి - 88,977 (44 శాతం) గెలుపు 

టిడిపి - గంజి చిరంజీవి - 88,965 (44 శాతం) స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి 

సిపిఎం - జొన్నదుల వీర రాఘవులు - 6627 (3 శాతం) మూడవ స్థానం