మానస సరోవర్: చిక్కుకున్న తెలుగు యాత్రికులు, బాబు ఆదేశంతో రంగంలోకి అధికారులు

Manasa Sarovar Yatra: Telugu tourists stuck in Nepal border
Highlights

మానససరోవర్‌లో ిచిక్కుకొన్న తెలుగు యాత్రికులు: సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  మానస సరోవర్ యాత్రకు  వెళ్లిన వేలాది మంది యాత్రికులు నేపాల్- చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా అక్కడే  ఉండిపోయారు. యాత్రికులను  స్వరాష్ట్రానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

మానస సరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికులు వాతావరణం అనుకూలించని కారణంగా మూడు రోజులుగా  నేపాల్-చైనా సరిహద్దుల్లోనే  ఉన్నారు. హిస్సా సరిహద్దు శిబిరంలో ఉన్న యాత్రికులు సరైన వసతులు లేక  నరకయాతన అనుభవిస్తున్నారు.  సరైన ఆహారం, వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు  కర్ణాటక,  తమిళనాడు  ఇతర ప్రాంతాలకు చెందిన యాత్రికులు కూడ ఉన్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికుల్లో ఎక్కువగా  మహిళలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.  బేస్ క్యాంపులో కేవలం వెయ్యి మంది ఆశ్రయం పొందేందుకు మాత్రమే సౌకర్యాలు ఉన్నాయి.కానీ, వాతావరణం  అనుకూలించని కారణంగా సుమారు మూడు వేల మందికిపైగా  బేస్ క్యాంపులో ఆశ్రయం పొందుతున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులను రంగంలోకి దింపారు. సహాయక చర్యలపై  నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. విజయవాడ, పాలకొల్లు, చింతలపూడి, తిరువూరు, విజయవాడ, కంకిపాడు, పోరంకి తదితర ప్రాంతాల నుండి జూన్ 23న యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లారు.వీరంతా జూలై మూడవ తేదిన తిరిగి రావాల్సి ఉంది. 

యాత్రికులు బస చేసిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో  తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నేపాల్‌లోని హిల్సాలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను హెలికాప్టర్‌లో సిమిల్‌కోట్‌కు తరలించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దిల్లీలోని ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌తో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. హిల్సాలోని 100 మంది వరకు తెలుగు యాత్రికులున్నారని శ్రీకాంత్‌ వివరించారు. తెలుగు యాత్రికులను హెలికాప్టర్‌లో సిమిల్‌కోట్‌కు, అక్కడి నుంచి విమానంలో నేపాల్‌గంజ్‌కు తరలించే అంశాన్ని పరిశీలించాలన్నారు. 

మానస సరోవర్‌ యాత్రలో చిక్కుకుపోయిన భారతీయ యాత్రికులను క్షేమంగా రప్పించడానికి నేపాల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిక్కుకుపోయిన సుమారు మూడు వేల మంది భారతీయుల్లో వంద మంది దాకా తెలుగువారు ఉన్నారని, వారందరినీ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌  నేపాల్‌ భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందిని కోరారు.


 

loader