చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. అంత్యక్రియలకు తీసుకెడుతున్న వ్యక్తి పాడెపై నుంచి లేచి కూర్చున్నాడు. ఇది చూసిన జనం కాసేపు భయాందోళనలకు గురైయ్యారు. ఆ తరువాత అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స్ అందించారు.

వివరాల్లోకి వెడితే పాడెపై తీసుకెళుతున్న ఓ వ్యక్తి లేచి కూర్చున్న సంఘటన సోమవారం చిత్తూరు జిల్లా, మదనపల్లె మండలంలో జరిగింది. వీఆర్వో కథనం మేరకు.. మండలంలోని  కట్టుబావి గ్రామంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి  చెట్టు కింద రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. 

ఇది గమనించిన గ్రామస్తులు విషయాన్ని గ్రామ కార్యదర్శి మనోహర్, వీఆర్వో నాగరాజుకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే వారు అక్కడికి చేరుకుని అతడిని పరిశీలించారు. అయితే అతడితో ఎలాంటి చలనం లేకపోవడం. ఊపిరి కూడా అందకపోవడంతో చనిపోయాడని భావించారు. 

వెంటనే ఖననానికి ఏర్పాట్లు చేశారు. ఊరికి సమీపంలో గుంతను తవ్వించి, పాడెపై మోసుకెళుతుండగా పాడెపై నుంచి ఒకసారిగా లేచి కూర్చున్నాడు. వెంటనే అతడిని 108 వాహనంలో మదన పల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించడంతో కోలుకున్నాడు. 
అయితే అతను ఎవరో, అక్కడెందుకు పడిపోయాడో.. ఏమైందో.. వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.