వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళా, పురుషుడు ఆత్మహత్యకు ప్రయత్నించి చివరికి రాజీపడినప్పటికీ అనుకోకుండా మంటల్లో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన మామిడాల చెన్నయ్య అద్దంకి డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.. వీరిలో ఇద్దరికి వివాహాలు కూడా అయ్యాయి.

ఈ క్రమంలో గ్రామానికి చెందిన పార్వతి అనే ఓ వివాహితతో చెన్నయ్యకి పరిచయమై వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమెకు 15 ఏళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.. భర్తతో మనస్పర్ధల కారణంగా అతనికి విడాకులిచ్చి ఏల్చూరిలో ఉంటోంది.

ఈ క్రమంలో చెన్నయ్య ప్రతిరోజు ప్రియురాలి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇలా ఉండగా చెన్నయ్యకు ఆమెపై అనుమానం కలిగింది... కూలి పనులకు వెళ్లవద్దని వారించేవాడు.

ఈ విషయంపై ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పీకలదాకా మద్యం తాగి ప్రియురాలి ఇంటికి వచ్చిన చెన్నయ్య.. తన బండి కోసం ఓ డబ్బాలో తెచ్చుకున్న పెట్రోలును ఇంట్లోకి తెచ్చాడు.

మరోసారి పార్వతిని పనికి వెళ్లవద్దని వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహానికి గురైన ఆమె తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ... చెన్నయ్య తెచ్చిన పెట్రోలును ఒంటిపై పోసుకుంది. నీవు లేకపోతే నేను కూడా ఉండనని అతను కూడా ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు.

ఆ తర్వాత కాసేపటికే ఇద్దరు రాజీ పడ్డారు. అయితే మద్యం మత్తులో ఉన్న చెన్నయ్య  ఒంటిపై పెట్రోల్ ఉన్న సంగతి మరిచిపోయి.. సిగరేట్ తాగేందుకు లైటర్ వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి.

వెంటనే తేరుకున్న పార్వతి ఒంటిపై ఉన్న దుస్తులు విప్పి బయటకు పరుగులు తీసింది. మద్యం మత్తులో ఉన్న చెన్నయ్య బయటకు రాలేక కేకలు వేయడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.