రైలు దిగిన ఓ ప్రయాణీకుడు రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు.


అనంతపురం: రైలు దిగిన ఓ ప్రయాణీకుడు రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో తాను దాటుతున్న పట్టాలపైనే రైలు వస్తున్న విషయాన్ని చివరిక్షణంలో గుర్తించి పట్టాలపై పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకొంది.

అనంతపురం రైల్వేస్టేషన్‌లోని రెండో ఫ్లాట్‌ఫాంపై లక్నో నుండి యశ్వంత్‌పూర్ వెళ్లే రైలు వచ్చి ఆగింది. ఆ రైలు నుండి దిగిన ఓ ప్రయాణీకుడు ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫాం వచ్చేందుకు హాడావుడిగా బయలుదేరాడు. కానీ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం‌పైకి వచ్చేందుకు పాదచారుల వంతెన ఎక్కకుండా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు.

కానీ, ఈ క్రమంలో అదే ప్లాట్‌ఫాం పై గూడ్స్ రైలు వచ్చింది. చివరి నిమిషంలో గూడ్స్ రైలును గుర్తించిన ఆ ప్రయాణీకుడు ఏం చేయలేక పట్టాలపై కిందపడుకొన్నాడు. 

గూడ్స్ రైలు వెళ్లిపోయిన తర్వాత అతను లేచి నిల్చున్నాడు. ఈ దృశ్యాలను రైల్వేస్టేషన్‌ లోని ఓ ప్రయాణీకుడు దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు.ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.