కూతురికి ఏదైనా కష్టం వస్తే.. ముందుగా తండ్రికే చెప్పుకుంటుంది. ఏ బాధైనా ముందు తల్లి కంటే ఎక్కువ తండ్రితోనే పంచుకోగలదు. అలాంటి కూతురిని ఓ యువకుడు తన కళ్ల ముందే వేధిస్తున్నా... ఆ తండ్రి చూస్తూ ఊరుకున్నాడు. ప్రేమిస్తావా చంపేయమంటావా అని బెదిరిస్తుంటే... కనీసం స్పందించలేదు. పైగా... కూతురిని అంతలా బాధిస్తున్న వ్యక్తికే మద్దుతగా నిలవడం గమనార్హం. ఈ దారుణ సంఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడ నగరంలోని రామరాజ్యనగర్ పాత రైల్వే కట్ట వద్ద ఓ బాలిక(15) తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఆమె తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా... బాలికకు ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉండేది. అయితే.. ఆమె ఆశలకు ఆదిలోనే తండ్రి ఆనకట్ట వేశాడు. ఏడో తరగతిలోనే చదువు మాన్పించేశాడు. దీంతో బాలిక చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది.

Also Read సారా తాగించి ఒకరి తర్వాత ఒకరు యువతిపై అత్యాచారం...

కాగా... అదే ప్రాంతానికి చెందిన రసూల్ అనే యువకుడు గత కొద్ది రోజులుగా బాలికను ప్రేమ పేరిట వేధిస్తూ వస్తున్నాడు. ప్రేమించకపోతే చంపేస్తాను లేదా చచ్చిపోతానంటూ బెదిరించాడు. దీంతో వెంటనే తన తండ్రికి చెప్పుకుంది. అతను కనీసం స్పందించలేదు. 

అయితే...రసూల్ ఈసారి ఏకంగా బాలిక తండ్రికే ఎసరు వేశాడు. అతనికి రోజూ మద్యం తాగించేవాడు. ఒకరోజు బాలిక తండ్రి ఎదుటే ఆమెను ప్రేమించాలంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. బాలిక ఎంత మొత్తుకున్నా.. తండ్రి మద్యం తాగుతూ కూర్చున్నాడే తప్ప కాపాడలేదు. కూతురి పరిస్థితి చూసి చలించిపోయిన తల్లి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వాళ్లు వచ్చి బాలికను రక్షించారు.

బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రసూల్ ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.