కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సిందిపోయి.. కిరాతకంగా ప్రవర్తించాడు. భార్య చెల్లెలిపై కన్నేసి.. ఆమెను దక్కించుకోవాలని అనుకున్నాడు. అందుకు.. భార్య అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. దీనిలో భాగంగా కట్టుకున్న అర్థాంగిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బేతంచెర్ల మండలం గోరుమాను కొండ తండాకు చెందిన సుశీలబాయికి రెండేళ్ల క్రితం అలేబాదు  తండాకు చెందిన రవినాయక్‌తో వివాహమైంది. వారికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. కాగా.. రవి నాయక్ కన్ను.. సుశీల బాయి చెల్లెలిపై పడింది.  కొద్దిరోజుల నుంచి సుశీలబాయి చెల్లిని వివాహం చేసుకొంటానని రవినాయక్‌ చెప్పేవాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

భార్యను అంతమొందించాలని పథకం ప్రకారం.. ఆదివారం తనతో పాటు జీవాలు మేపేందుకు కొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బండరాళ్లతో మోది చంపేసి మృతదేహాన్ని లోయలోకి తోశాడు. ఏమీ ఎరుగనట్లు ఇంటికి వచ్చి తన భార్య కనబడడంలేదని గ్రామస్తులకు చెప్పాడు. భార్య తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని ఫోన్‌ చేసి చెప్పడంతో ఆందోళనకు గురై రాత్రికి రాత్రే గ్రామానికి చేరుకొని కుమార్తె కోసం గాలించారు. 

సుశీల బాయి మృతదేహం గ్రామ శివార్లలోని లోయలో పడి ఉండడాన్ని సోమవారం ఉదయం గమనించిన పశువుల కాపరులు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. విషయం వెలుగులోకి రావడంతో నిందితుడు రవినాయక్‌ పరారయ్యాడు. హతురాలి తండ్రి సేవ్యా నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.