ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. భర్తతో విభేదాలు రావడంతో విడిపోయి కూతురితో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఒంటరి జీవితంలో ఓ వ్యక్తి ప్రవేశించాడు. జీవితాంతం తోడుంటానని నమ్మించి.. దగ్గరయ్యాడు. ఆరు నెలలుగా ఆమెతో సహజీవనం చేస్తూ వచ్చాడు. అయితే.. చివరకు ఈ బంధంలోనూ విభేదాలు రావడం మొదలయ్యాయి. దీంతో.. ఆవేశంలో సదరు మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె కొన ఊపిరితో ఉండగానే.. గొయ్యి తీసి పాతిపెట్టడం గమనార్హం.

ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు  ఇలా ఉన్నాయి. మండలంలోని గండవరం సమీపంలోని దగదర్తి మండల సరిహద్దు ప్రాంతమైన గొట్లపాళెం వద్ద కాలువకట్టపై పాక వేసుకుని పొన్నూరు సుభాషిణి (36) అనే గిరిజన మహిళ ఉండేది.  ఆమెకు గతంలో దగదర్తి గిరిజన కాలనీకి చెందిన రమణయ్య అనే వ్యక్తితో వివాహం జరగ్గా వారు కొన్నేళ్ల క్రితమే విడిపోయారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.

అయితే.. ఇటీవల  సుభాషిణికి సాములు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆరు నెలలుగా వీరు సహజీవనం చేస్తున్నారు. కాగా సుభాషిణిపై స్వాములుకి అనుమానం ఉంది. ఇద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. అలా జరిగినప్పుడల్లా ఆమె పుట్టింటికి వెళుతుండేది. తర్వాత స్వాములు వెళ్లి ఆమెను తీసుకొస్తుండేవాడు.

గత నెల 27న కాలువకట్టపై ఉన్న పాకలో సుభాషిణి, స్వాములు మద్యం సేవించి గొడవ పడ్డారు. అదేరోజు రాత్రి స్వాములు ఆమెపై కిరాతంగా దాడి చేసి ఇంటి వెనుక గుంత తీసి పూడ్చివేశాడు. కాగా.. ఈ ఘాతుకాన్ని సుభాషిణి ఏడేళ్ల కుమార్తె కళ్లారా చూసింది. అయితే.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో బాలిక నోరు విప్పలేదు.

రెండు రోజుల తర్వాత తన తల్లి  చనిపోయిన విషయాన్ని బంధువులకు ధైర్యం చేసి తెలియజేసింది. వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతురాలి కాళ్లు, చేతులు కన్పిస్తుండడంతో కొడవలూరు పోలీసుల దృష్టికి తెచ్చారు.

కాగా.. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తన తల్లికి ఊపిరితో ఉండగానే పాతి పెట్టాడంటూ బాలిక చెప్పడం గమనార్హం. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.