అనుమానంతో ఓ వ్యక్తి  వివాహితను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లా లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం నగరానికి చెందిన యశోద (32)కు రాణినగర్‌కు చెందిన శంకర్‌ అనే రాడ్‌బెండర్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి తరుణ్‌తేజ్, యశ్వంత్‌ అనే కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్న బుక్కరాయసముద్రం మసీదు కొట్టాలకు చెందిన ఆటో డ్రైవర్‌ మల్లికార్జునతో యశోదకు పరిచయం ఏర్పడి సహజీవనం చేశారు. 

రెండేళ్లుగా నగరంలోని అశోక్‌నగర్‌లో నివాసముంటున్నారు. యశోద కుమారులిద్దరినీ అక్క విజయలక్ష్మి కొత్తచెరువు హాస్టల్‌లో చేర్పించింది.యశోద మరొకరితో చనువుగా ఉన్నట్లు మల్లికార్జునకు అనుమానం వచ్చింది. ఈ విషయమై మాటామాటా పెరిగి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆవేశానికి లోనైన మల్లికార్జున రాడ్‌తో తలపై బలంగా మోదడంతో తీవ్రంగా గాయపడిన యశోద కొద్దిసేపటికే మృతి చెందింది. అనంతరం మల్లికార్జున అక్కడి నుంచి పరారయ్యాడు.

హత్య చేసిన అనంతరం మీ మరదల్ని చంపేశానంటూ యశోధ అక్క భర్తకు నిందితుడు చెప్పడం గమనార్హం. కాగా.. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.